వరదలతో జరిగిన నష్టమెంత - కేంద్రం కీలక హామీ..!!
రాష్ట్రంలో వర్షాలు...వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మరణించిన వారి సంఖ్య 33కు చేరింది. ఎన్టీఆర్ జిల్లాలోనే 25 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వరద బాధితుల సహాయార్ధం పెద్ద సంఖ్యలో విరాళాలు వస్తున్నాయి. సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. కేంద్రం సైతం తక్షణ సాయం ప్రకటించేందుకు సిద్దమైంది.
కేంద్ర సాయం
రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టం పై కేంద్ర అధికారుల టీం క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది. కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన టీంతో పాటుగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కేంద్రం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ పటిష్ఠత కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్రానికి ఇచ్చే నివేదిక ఆధారంగా తక్షణ సాయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాధమిక నివేదిక అందించింది.

భారీ నష్టం
ఈ వరదల కారణంగా..రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు 3,756 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్నాయని తేలింది. పంచాయతీరాజ్ రోడ్లు 348 కిమీ దెబ్బతిన్నాయి. విజయవాడతో సహా వివిధ పట్టణాల్లో 533.57 కిమీ రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. 33 మంచినీటి పథకాలు దెబ్బతిన్నాయి. 1,69,370 హెక్టార్లలో వ్యవసాయ, 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. 46.22 హెక్టార్ల ఆక్వా చెరువులు దెబ్బతిన్నాయి. 275 పశువులు, 59,975 కోళ్లు మృత్యువాతపడ్డాయి. 403 మత్స్యకార బోట్లు పూర్తిగా, 26 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 414 వలలు పాడైపోయాయి.
నివేదిక సిద్దం
గత ఐదురోజుల్లో విజయవాడలో 339 రైళ్లు రద్దు కాగా, 181 రైళ్లను దారి మళ్లించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడ సహా ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో 214 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయగా, 45,369 మంది పునరావాసం పొందుతున్నారు. 158 వైద్యశిబిరాల్లో సేవలు అందిస్తున్నారు. 344 మంది గర్భిణులను వైద్యశాలలకు తరలించారు. 50 ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ బృందాలు, ఆరు హెలికాప్టర్లు, 228 బోట్లతో పాటు 315 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications