తన పోలికలు లేవని రెండు నెలల బిడ్డ నోటికి ప్లాస్టర్ వేసి ..కసాయి తండ్రి ఏం చేశాడంటే !!
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి ఆ చంటి బిడ్డ పాలిట కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని చిన్నారిని అనుమానపు తండ్రి అకారణంగా అనంతలోకాలకు పంపేశాడు. బిడ్డ తన పోలికలతో లేదన్న కారణంతో కన్నతండ్రి రెండు నెలల పసికందు పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా రెండు నెలల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తండ్రి అత్యంత దారుణంగా పసిబిడ్డను హతమార్చాడు.

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే కళ్యాణదుర్గం లో నివాసముంటున్న మల్లికార్జున్ అనే వ్యక్తికి రెండు నెలల క్రితం పాప పుట్టింది. పాపకు తన పోలికలు లేవని అప్పటినుండి భార్యతో తరచూ గొడవకు దిగుతున్నాడు మల్లికార్జున్. ఈ క్రమంలో మల్లికార్జున తన భార్య చిట్టెమ్మ ,రెండు నెలల పాపతో కలిసి కళ్యాణదుర్గం లోని ఆర్డిటి ఆస్పత్రికి వెళ్లాడు . పాప ఏడుస్తుంటే ఓదారుస్తానని, పాపను బయటకు తీసుకువెళ్లిన మల్లికార్జున్ సాయంత్రమైనా తిరిగిరాలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పాప కోసం పోలీసుల గాలింపు.. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి
రంగంలోకి దిగిన పోలీసులు గురువారం రాత్రంతా పాప కోసం వెతికారు. బంధువులంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మల్లికార్జున్ తో పాటు పాప ఫోటోలను పోలీసులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కేంద్రంలో నిందితుడు మల్లికార్జున్ ను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా, చిన్నారిని తానే చంపానని తండ్రి అంగీకరించాడు. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్టు అంగీకరించాడు .

తన పోలికలు లేవని పసికందును హతమార్చిన తండ్రి
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పోలీసులకు ఒక సంచిలో పాప మృతదేహం దొరికింది. పాప నోటికి ప్లాస్టర్ వేసి ఉండడంతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై అనుమానం తోనే భర్త పుట్టిన బిడ్డ తన పోలికలతో లేదని రెండు నెలల పసికందు ప్రాణాలు తీసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసిబిడ్డ ప్రాణాలు తీసిన పైశాచిక తండ్రిని ప్రస్తుతం పోలీసులు కళ్యాణదుర్గం తరలించి విచారణ జరుపుతున్నారు. సిఐ తేజ మూర్తి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బిడ్డ దూరమై, భర్త నేరస్తుడై శిక్ష అనుభవిస్తున్న తల్లి .. మ్రుగ్యంగా మారుతున్న మానవ సంబంధాలు
నవమాసాలు మోసి కన్న బిడ్డని, భర్త దారుణంగా హతమార్చడంతో ఆ తల్లి దీనంగా రోదిస్తోంది. బిడ్డను చంపిన తండ్రి నేరస్థుడు కాగా, అటు బిడ్డకు దూరమై, ఇటు భర్త నేరస్థుడిగా మారి తల్లి శిక్షను అనుభవిస్తుంది. ఒక మల్లికార్జున్ మాత్రమే కాదు అనుమానం తో సంసారం విచ్ఛిన్నం చేసుకుంటున్న ఎంతోమంది, ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు.
అభం శుభం తెలియని పసి పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. భార్యపై కోపంతో బిడ్డలను నేలకు కొట్టి చంపుతున్న తండ్రులే కాదు, అనుమానంతో కన్న బిడ్డల ఉసురు తీస్తున్న తండ్రులు, కన్న బిడ్డలపైనే అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు పెరిగిపోతున్నారు.
మానమ సంబంధాలు మృగ్యంగా మారుతున్నాయి. నిత్యం చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు రోజు రోజుకి తరిగిపోతున్న మానవ విలువలకు, రక్త సంబంధాలకు అద్దం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications