సీఎం జగన్ ను ప్రతివాదిగా చేర్చడం సరికాదు - హైకోర్టు కీలక వ్యాఖ్యలు : అది సహజమే..!!
ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు ముఖ్యమంత్రి జగన్ పేరు పెట్టారు. ప్రభుత్వ పథకాలకు సీఎంతో పాటుగా రాజకీయ నేతల పేర్లు పెట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అందులో సీఎంను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి, సీఎం జగన్ సహా పలువురి పేర్లు పెట్టడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలుచేశారు.

నేతల పేర్లతో పథకాలు సహజం
సీఎంను వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేర్చటం పైన రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యవహారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతి పార్టీ రాజకీయ నేతల పేర్లతో పథకాలు ప్రారంభించడం సహజమేనని పేర్కొంది.

ముఖ్యమంత్రి పేరు తొలిగించాలి
అది వ్యక్తిగత ప్రయోజనం ఎలా అవుతుందని ప్రశ్నించింది. సీఎంను ప్రతివాదిగా చేర్చడానికి అనుమతిస్తే.. భవిష్యత్తులో ప్రధానమంత్రినీ ప్రతివాదిగా చేర్చే సంప్రదాయం మొదలవుతుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పథకాలకు నేతల పేర్లు పెట్టకుండా చట్టం చేసేందుకు పోరాడాలని సూచించింది. ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ కోర్టులో సవాలు చేయడం సరికాదంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి పేరును తొలగించి పిల్‌కు నంబరు కేటాయించాలని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
Recommended Video

ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్నీ కోర్టులో సవాలు సరి కాదంటూ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల పైన పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పలు సందర్భాల్లో న్యాయస్థానం సైతం ఆ నిర్ణయాల పైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని పిటీషన్లను కొట్టి వేసింది. ఇప్పుడు సీఎం పేరుతో పధకాల పేరు అంశం పైన సీఎంను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తూ ఈ పిటీషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం తప్పు బట్టింది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకొనే ప్రతీ నిర్ణయాన్ని సవాల్ చేయటం కూడా సరి కాదంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి ఊరటనిచ్చేవిగా మారాయి.












Click it and Unblock the Notifications