కేవీపీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారా - ఐఏఎస్ శ్రీలక్ష్మీ కేసులో కొత్త టర్న్ : పాత్ర ఉందంటూ సీబీఐ వాదనలు..!!
అక్రమ మైనింగ్ కు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణ సమయంలో సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు పేరు ప్రస్తావిస్తే..ఆయన స్టేట్‌మెంట్‌ను ఎందుకు తీసుకోలేదని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. ఓఎంసీ కేసులో గనుల చట్టానికి విరుద్దంగా..నిర్లక్ష్యంగా సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసి పరిహారం ఇప్పించాలని శ్రీలక్ష్మీ దాఖలు చేసిన కేసులో విచారణ సాగుతోంది.

శ్రీలక్ష్మీ అధికార దుర్వినియోగం చేసారంటూ
వాదనల్లో భాగంగా.. సీబీఐ న్యాయవాది శ్రీలక్ష్మీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. నిబంధనల కు విరుద్దంగా ఓఎంసీకి లీజులు కేటాయించారని కోర్టు ముందు వాదించారు. గాలి జనార్ధన రెడ్డికి చెందిన ఓఎంసీ కర్ణాటకలో అక్రమంగా మైనింగ్ చేసి.. ఖనిజాన్ని తరలించటానికి వీలుగా శ్రీలక్ష్మీ ఏపీలో లీజులు కేటాయించారని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాకున్నా.. ఇతరులు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదంటూ తన వాదనల్లో పేర్కొన్నారు. ఓఎంసీ మైనింగ్ లీజు అక్రమాల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్ర స్పష్టంగా ఉందని, ఆమెపై సీబీఐ నమోదుచేసిన కేసును కొట్టేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కేవీపీని కలవమని సూచించారు
లీజు కేటాయించే క్రమంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా శశికుమార్ అనే సాక్షి స్టేట్‌మెంట్‌ను సీబీఐ న్యాయవాది ధర్మాసనానికి చదివి వినిపించారు. మైనింగ్ లీజు కోసం అప్పటి ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి వద్దకు వెళ్తే కేవీపీ రామచంద్రరావును కలవాలని ఆమె చెప్పారని సాక్షి వెల్లడించినట్లు తెలిపారు. లీజుకు సంబంధించిన ఇతర అంశాల్లో సహాయం చేయడానికి అప్పటి మైన్స్ డైరెక్టర్ రాజగోపాల్‌ను కూడా కలవాలని శ్రీలక్ష్మి చెప్పారని తెలిపారు.

శ్రీలక్ష్మీ పైన కేసులు కొట్టేయాల్సిన అవసరం లేదు
రూ.8 లక్షలు సమకూర్చాలని శ్రీలక్ష్మి కోరినట్లు సాక్షి వెల్లడించారని తెలిపారు. ఓఎంసీకి చెందిన గాలి జనార్ధన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు ఇతర దరఖాస్తులను శ్రీలక్ష్మి తొక్కిపెట్టారని తెలిపారు. ఈ వాదనల సమయంలో న్యాయస్థానం కేవీపీ స్టేట్‌మెంట్ గురించి ప్రశ్నించారు. ఇక, శ్రీలక్ష్మి చట్టం ప్రకారం వ్యవహరించారని న్యాయవాది రాఘవాచార్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని, పిటిషనర్‌పై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో..న్యాయస్థానం విచారణకు వాయిదా వేసారు.