పుష్పశ్రీవాణి ఎస్టీనే: హైకోర్టు కీలక తీర్పు
కురుపాం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పుష్పశ్రీవాణి ఎస్టీనే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆమె ఎస్టీ కాదంటూ 2019లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు తాజా తీర్పుతో పిటిషనర్లు నిమ్మక సింహాచలం, నిమ్మక జయరాజ్‌లకు హైకోర్టులో చుక్కెదురైనట్లయింది.
పిటిషనర్లు తమ ఆరోపణలను నిరూపించలేకపోయారని హైకోర్టు పేర్కొంది. పుష్ప శ్రీవాణి ఎస్టీ (కొండదొర) అని హైకోర్టు నిర్ధారించింది. డీఎల్సీ, జిల్లా కలెక్టర్ దర్యాప్తు నివేదికల ఆధారంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. పుష్పశ్రీవాణి కుల ధృవీకరణ పత్రాలు సరైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి తండ్రి, సోదరి అందరూ ఎస్టీలే అని స్పష్టం చేసింది హైకోర్టు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయం గెలిచింది అంటూ పుష్పశ్రీవాణ సోషల్ మీడియా వేదిక హర్షం వ్యక్తం చేశారు.

2019 సంవత్సరంలో కురుపాం నియోజకవర్గ శాసన సభ్యురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నికైన నేపథ్యంలో నేను ఎస్టీ కొండదొర కులానికి చెందిన వ్యక్తిని కాదు అని ఆ ఎన్నిక చెల్లదని డిక్లేర్ చేయవలసిందిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎలక్షన్ కేసు E.P.20/2019 దాఖలు చేసిన విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ ఐదు సంవత్సరాల్లో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మేము సమర్పించిన ఎవిడెన్స్ ల ఆధారంగా నేను ఎస్టీ కొండదొర కులస్తురాలునే అని అభిప్రాయపడి గౌరవ హైకోర్టు వారు కేసు ను కొట్టేయడం జరిగింది అని పుష్పశ్రీవాని తెలిపారు.
నేను ఎస్టీ కొండదొర కాదు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారములు పిటీషనర్లు దాఖలు చేయలేదని కోర్టు వారు స్పష్టం చేశారు. పై ఆరోపణలే కాకుండా ఇతర సాంకేతిక పరమైన ఆరోపణలు కూడా గౌరవ కోర్టు వారు తిరస్కరించి కేసును కొట్టేయడం జరిగినది. ఈ కేసు 2019 ఎన్నికలకు సంబంధించినది అని ఆ అసెంబ్లీ కాల పరిమితి 2024 సంవత్సరంతో పూర్తి అయినందున ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు వారు స్పష్టం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని పుష్పశ్రీవాణి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications