తిరుమలలో శాస్త్రోక్తంగా..: ఏడాదిలో నాలుగుసార్లే
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 74,149 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,066 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.72 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు చేపట్టిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతా రామ్, సదా శివరావు, జంగా కృష్ణమూర్తి, జానకి దేవి, మహేందర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు.
టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర ఇతర అధికారులు కోయిల్ అళ్వార్ తిరుమంజనం సేవలో పాల్గొన్నారు. సంవత్సరంలో నాలుగుసార్లు- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు.
శుద్ధి అనంతరం నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. ఈ కారణంగా జూలై 16న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications