రాజధాని అమరావతికి క్లియరెన్స్?
Amaravati: రాజధాని అమరావతిపై నిర్మాణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ముందడుగు వేయబోతోంది. నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది.
అమరావతిలో నిర్మాణాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో.. ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది.

ఈ పరిస్థితుల మధ్య రేపు రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి భేటీ కాబోతోంది. ఇది- 48వ సమావేశం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో చర్చకు వచ్చిన అంశాలు, ప్రతిపాదనలను మంత్రివర్గంలో ఆమోదించవచ్చు.
కేపిటల్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు మంజూరు చేసిన నిధులు- భూముల కేటాయింపు, చేపట్టిన నిర్మాణ పనులను సమీక్షించడం, జంగిల్ క్లియరెన్స్, రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎక్స్ ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలపై చర్చిస్తారు. కొత్తగా చేపట్టదలిచిన భూసేకరణ కూడా ఇందులో ప్రస్తావనకు రానుంది.
సీఆర్డీఏ 47వ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలపైనా చర్చిస్తారు. ఇదివరకు సీఆర్డీఏ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాల సముదాయాలు, వాటికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం 1,732.31 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
లా యూనివర్సిటీ, క్వాంటం వ్యాలీ నిర్మాణానికి కేటాయించిన భూముల స్థితిగతులు ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి కోసం ఇదివరకటి సీఆర్డీఏ సమావేశంలోనే ప్రభుత్వం భూములను కేటాయించింది. ఆదాయపు పన్ను విభాగం, రెడ్ క్రాస్ సొసైటీ, కోస్టల్ బ్యాంక్, ఐఆర్సీటీసీకి భూములను కేటాయించింది అప్పట్లో.
ఆయా అంశాలపై చర్చించి ప్రభుత్వం తుది ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదనలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. అనంతరం- వీటన్నింటిపైనా మంత్రివర్గం పచ్చజెండా ఊపితే.. పనులు వేగం పుంజుకొంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications