వాళ్లవి అన్నీ అబద్దాలు, ప్రతి ఒక్కరు బయటకు రండి!: చంద్రబాబు పిలుపు

అమరావతి: ప్రకాశం బ్యారేజీకి చుక్క నీరు రాకపోయినా పట్టిసీమ ద్వారా నీటిని ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. పోలవరం నిర్మాణం జాప్యం అవుతుందనే ఉద్దేశ్యంతో పట్టిసీమను నిర్మించామని చెప్పారు. నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామన్నారు. పంటలకు ఇబ్బందులు రాకుండా కాపాడుకోగలిగామన్నారు.
తూర్పు డెల్టా స్లూయిస్ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.3920 కోట్లు ఇచ్చామని చెప్పారు. వైకుంఠాపురం బ్యారేజీ వద్ద 10 టీఎంసీల నీటిని స్టోర్ చేశామని చెప్పారు. నాగావళి - వంశధార నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. గొలుసుకట్టు చెరువులను తిరిగి నిర్మించి భూగర్భ జలాలు పెంచుతామన్నారు.

నీరు పెరిగితే సంపద పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలనిచూస్తున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలే తిప్పికొడతారన్నారు. అక్టోబర్‌లో పోలవరం మొదటి గేట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విపక్షాలు తమ ప్రభుత్వంపై అర్థంపర్థం లేని, అవాస్తవ ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రతిపక్షాల అర్థంలేని ఆరోపణలపై ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఖండించాలన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!