తిరుమలలో కన్నుల పండువగా శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు- ప్రత్యేకత ఇదే
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొని ఉంది. దీపావళి పండగతో పాటు వరుస సెలవులు రావడం వల్ల భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. వేలాదిగా తిరుమలకు చేరుకుంటోన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.
సోమవారం నాడు 70,902 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 22,858 మంది తలనీలాలను సమర్పించారు. 24 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి ఎనిమిది నుంచి 8 గంటల సమయం పట్టింది. హుండీ ద్వారా 3.24 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

అటు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు అమ్మవారు గజ వాహనంపై ఊరేగనున్నారు. బుధవారం గరుడ వాహన సేవ ఉంటుంది. ఈ రెండు సేవల్లో అమ్మవారికి అలంకరించడానికి శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుమల నుంచి తిరుచానూరుకు శోభాయాత్రగా తీసుకొచ్చారు.
అంతకుముందు తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి ఈ హారాన్ని ఆలయ నాలుగు వీధుల్లో ఊరేగించారు. ప్రత్యేకంగా శోభాయాత్ర నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, కార్యనిర్వాహక అధికారి ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం తిరుచానూరుకు తీసుకొచ్చారు.
తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో, కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి అలంకరించారు.
అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహన సేవ కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకొచ్చామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications