నేటి నుంచే భాద్రపద మాసం- ప్రత్యేకతలేంటీ?
అమరావతి: అమావాస్యతో పవిత్ర శ్రావణ మాసం ముగిసింది. నేటి నుంచి భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పండగ. అదే సమయంలో- వరాహజయంతి, వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు తర్పణాలను వదిలే మహాలయ పక్షం.. ఈ నెలలోనే వస్తాయి. ఇది ముగిసిన వెంటనే దసరా సందడి ఆరంభమౌతుంది.
హిందూ క్యాలెండర్‌లో భాద్రపదం ఆరవ మాసం. వర్ష రుతువులో రెండవది. దేవతలు, పితృదేవతలకు సమానంగా పూజలు చేయడం ఈ నె మాసం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తొలి అర్ధభాగం అంటే శుక్లపక్షంలో దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలంగా భావిస్తారు. రెండో అర్ధభాగం అంటే కృష్ణ పక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలమని వేదాలు చెబుతున్నాయి.

శుక్లపక్ష కాలంలో ఉండ్రాళ్ల తద్దె, గౌరీ పూజ, వినాయక చవితి, శుక్ల చవితి, శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల చతుర్ధశి, కృష్ణ పక్ష ఏకాదశి వంటి పండగలు జరుపుకొంటారు.ఇందులో శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా, ద్వాదశిని వామన జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నెల 30వ తేదీ నుంచి మహాలయ పక్షం ఆరంభమౌతుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పితృదేవతలను ఆరాధించడానికి, వారికి పిండ ప్రదానాలు చేయడానికి, తర్పణాలను వదలడం, వారికి ఉత్తమగతులను అందించే కార్యాలకు మాత్రమే ఇది పరిమితం.
పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేయడం అత్యవసరం. బ్రాహ్మణులకు బియ్యం, నువ్వులు.. వంటి ఆహార ధాన్యాలు, గోవు, బంగారాన్ని దానంగా సమర్పించుకోవడం వల్ల సద్గతులు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు. శ్రాద్ధవిధులను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం, పిండప్రదానం చేయడం వంటి కార్యాల వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications