ఆరు సెంట్ల భూమి కోసం కన్నతండ్రిని చంపేసిన కొడుకు..
సమాజంలో రోజు రోజుకు మానవ విలువలు అంతరించిపోతున్నాయి. తల్లి, తండ్రి అనే తేడా లేకుండా చంపేస్తున్నారు. చంపేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భూమి కోసం ఏకంగా కన్నతండ్రినే పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి కొడుకు. వృద్దాప్యంలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి అత్యంత దారుణంగా చంపేసాడు. ఆరు సెంట్ల భూమి కోసం ఓ కొడుకు, కని పెంచిన తండ్రినే దారుణాతి దారుణంగా హింసించి చంపేసాడు. యాభై ఏళ్ళ వయస్సులో ఉన్న తండ్రిని హత్య చేశాడు. అపై క్రూరంగా అతనిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
అవనిగడ్డలో ఈ దారుణం చోటుచేసుకుంది. నాగాయలంక మండలం బవదేవరపల్లికి చెందిన హరి మోహన్‌కు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపి తండ్రి బాధ్యతలు తీర్చుకున్నాడు. ఇక, ఉన్న ఒక్కగానొక్క కుమారుడేమో అమ్మమ్మ ఇంట్లో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆ కొడుకు 24ఏళ్లు. కొన్ని సంవత్సరాల క్రితం హరిమోహన్ భార్య అనారోగ్యంతో మృతిచెందింది. తాపీ పనిచేసే కొడుకు మద్యానికి బానిసయ్యాడు. తండ్రి ఎన్నిసార్లు మందలించినా పెడచెవిన పెట్టాడు. ఇక, కొడుకు మీద గతంలో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. కొడుకు భవిష్యత్తు ఎమవుతుందోననో ఎన్నోసార్లు హెచ్చరించాడు హరిమోహన్. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

తండ్రి మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించిన కొడుకు : హరిమోహన్‌కు ఊర్లో ఒక ఆరుసెంట్ల భూమి ఉంది. అక్కడే ఓ చిన్న పూరిళ్లు కట్టుకుని అందులోని ఒంటరిగా జీవితం గడుపుతున్నాడు. ఇక, ఖర్చులకు కూలీ పనులు చేస్తూ బతికేవాడు. ఆ వయసులో తండ్రికి బాసటగా నిలవాల్సిన కొడుకు తన భూమిని కాజేయాలనుకున్నాడు. కొద్దిరోజులుగా ఆ భూమి విషయంలో వారిద్దరికి పలుమార్లు గొడవలు కూడా అయ్యాయి. ఆ భూమిని అమ్మి వచ్చే డబ్బుతో జల్సాలు చేయాలనుకున్నాడు కొడుకు. తండ్రిని ఎంత అడిగినా ఒప్పుకోవడం లేదని శనివారం రాత్రి భూమి విషయంపై మరోసారి తండ్రిపై గొడపపడ్డాడు. ఈ క్రమంలో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో అక్కడిక్కడే కుప్పకూలిన హరిమోహన్ తుదిశ్వాస విడిచాడు. అంతటితో ఆగకుండా తండ్రి మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఇంటినుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి కొడుకును ఆపే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికి దారుణం జరిగిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications