విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖా -అప్పుకోసం ప్రభుత్వం ఇలా : రాత్రికి రాత్రే తతంగం పూర్తి-విలువ ఎంత అంటే..!!
ప్రభుత్వ నిర్వహణలో భాగంగా అప్పుల కోసం తిప్పులు పడుతున్న జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రభుత్వ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టింది. విశాఖలోని రూ.2,954 కోట్ల మార్కెట్ విలువ ఉన్న ప్రభుత్వ ఆస్తులను రాష్ట్రప్రభుత్వం తనఖా పెట్టేసింది. విశాఖలో ఉన్న 13 ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించారు. తాజాగా... ఆ మొత్తం స్థలాలను ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తాకట్టు పెడుతూ రిజిస్ట్రేషన్ చేశారు.

ఆస్తుల తనఖా రిజిస్ట్రేషన్
ఈ భూములకు రూ.2800 కోట్ల విలువ కట్టారు. ఇందులో రూ.1600 కోట్లను అప్పుగా తెచ్చుకున్నారు. ఆ భూముల్లో అనేక ప్రభుత్వ భవనాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇచ్చిన అన్ని బ్యాంకులకు ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరిస్తోంది. కేవలం డాక్యుమెంట్ల సమర్పణ కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ తరపున ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఎస్‌బీఐ ట్రస్టీ కంపెనీ తరఫున ఇమ్మాన్యుయేల్ ఏసురత్నం మధ్య ఈ తనఖా ఒప్పందం రిజిస్ట్రేషన్ జరిగింది.

రాత్రికి రాత్రే తనఖా రిజిస్ట్రేషన్ పూర్తి
ఈ ఏడాది సెప్టెంబరు 27న విజయవాడలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం పూర్తిచేశారు. రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ సబ్‌రిజిస్ట్రార్ (గాంధీనగర్) ఆఫీసులో తాకట్టు తతంగం పూర్తయింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 25 వేల కోట్ల మేర రుణాలకు నిర్ణయం తీసుకొని..ఆ మేర ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం అందులో రూ 21, 500 కోట్లు అప్పుగా తీసుకుంది.తర్వాత ఈ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తొలుత భూ పరిపాలన కమిషనర్‌కు బదలాయించారు.

అప్పుల కోసం ప్రభుత్వ తిప్పలు
తర్వాత ఏపీ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆమోదం పొంది రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించారు. ఈ డాక్యుమెంట్లు విశాఖ బ్యాంకు అధికారులకు ఇచ్చాక మరో రూ.3,000 కోట్ల రుణం తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.17,000 కోట్లు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రుణం పొందేందుకు గతేడాది నవంబరులోనే ఎస్‌బీఐ క్యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

షరతుల్లో భాగంగా తనఖా పెట్టారా
ఈ రుణం తిరిగి ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నిస్తే అదనపు ఎక్సైజ్ సుంకం విధించి రాష్ట్రంలోని 10 మద్యం డిపోల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖజానాకు మళ్లించి అక్కడి నుంచి ఆ మొత్తం బదిలీ అయ్యేలా ఏర్పాటుచేసింది. దీనిపై కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగం సైతం రాష్ట్రానికి లేఖ రాసింది. రుణం సమకూర్చిన ఎస్‌బీఐ రుణం విలువలో 10% మొత్తానికి సమానమైన ఆస్తులు కార్పొరేషన్ పేరిట చూపించాలని నిబంధన విధించింది. దీంతో విశాఖపట్నంలోని విలువైన ఆస్తులను ప్రభుత్వం కార్పొరేషన్‌కు బదలాయించింది.
Recommended Video

రాజకీయంగా విమర్శలు తప్పవా
డాక్యుమెంట్ల స్వీకరణతో సరిపెట్టుకోకుండా ఈ ఆస్తుల తనఖా ఒప్పందాన్ని రిజిస్ట్రేషన్ చేయాలనడంతో తాజాగా ఆ ప్రక్రియ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే ఆర్దికంగా ఇబ్బందులతో సతమతం అవుతున్న సమయంలో ఈ తనఖా ద్వారా రుణం పొందగలిగినా.. రానున్న రోజుల్లో ఏం చేస్తారనే చర్చ మొదలైంది. తిరిగి ఈ రుణాల చెల్లింపు సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే, ప్రభుత్వం ఈ తనఖాల ద్వారా సమీకరించిన మొత్తాన్ని మూలధన వ్యయంగా వెచ్చించటం లేదని.. సంక్షేమం పేరిట ఖర్చు చేయటం ద్వారా భరింత భారం పెరుగుతందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో..ప్రభుత్వం ఇప్పుడు తమ నిర్ణయాలను ఏ విధంగా సమర్ధించుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications