మంత్రి బొత్స సత్యనారాయణ పీఏ ఇంట్లో చోరీ
రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పీఏ కమలాకర్ ఇంట్లో చోరీ జరిగింది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని ఉడా కాలనీ ఫేజ్ -3, ఇంటినంబర్ 177లో మంత్రి బొత్స సత్యనారాయణ పర్సనల్ అసిస్టెంట్ కమలాకర్ నివాసం ఉంటున్నారు. ఆయన వృత్తిరీత్యా విజయవాడకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన సతీమణి అమెరికాలో ఉన్నారు. ఇంట్లో కమలాకర్ కుమార్తె, అల్లుడు మాత్రమే నివసిస్తున్నారు. కమలాకర్ కుమార్తె డాక్టర్ మౌనిక విశాఖ రైల్వేఆస్పత్రిలో వైద్యురాలిగా, అల్లుడు గజపతినగరంలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.

కమలాకర్ కుమార్తె విశాఖపట్నం, అల్లుడు గజపతినగరం వెళ్లారు. ఉదయం వారిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇల్లంతా చిందరవందరగా ఉంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో ఫింగర్ ఫ్రింట్స్ ఇన్‌చార్జ్ డీఎస్పీ టి.త్రినాథ్, సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనలో లక్ష రూపాయల నగదు, రెండు తులాల బంగారం, కిలో వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications