తూ.గో జిల్లాలో దారుణం.. కుక్కకు మత్తు బిస్కెట్లు ఇచ్చి అలా..!
మారుతున్న కాలానుగుణంగా మనుషుల్లో సైతం మార్పులు వస్తూనే ఉంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే నేరాలు, మోసాలకు పాల్పడే వారు కూడా పూటకో వేషం మారుస్తూ దందాణు కొనసాగిస్తూనే ఉంటున్నారు. ఆ రకం గానే కొత్త కొత్త ప్లాన్ లు అవలంబిస్తున్నారు. ఇప్పుడు అలాంటి మరో కొత్త ఎత్తుగడతో పెంపును శునకాన్ని బోల్తా కొట్టించి పని పూర్తి చేసేశారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది.
ఏం జరిగిందంటే..
గొల్లపాలెం గ్రామానికి చెందిన నేతి భగవాన్ ఇంటిని మరమ్మతులు చేయిస్తున్న కారణంగా పక్కింట్లో తాత్కాలికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. అయితే ఆ ఇంటి ఆవరణలో పెంపుడు కుక్క ఉండటాన్ని గమనించి.. అపహరణకు అడ్డంకిగా భావించి కుట్ర పన్నారు. ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఆ శునకానికి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు.

ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మొదట గేటుకు ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంటి తలుపును దెబ్బతీసి లోనికి వెళ్లారు. అయితే ఇంటి లోపల విలువైన వస్తువులు ఎక్కువగా లేకపోవడంతో దొంగలు నిరాశ చెందారు. కానీ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లకుండా.. ఇంటిలో ఉన్న ల్యాప్‌టాప్‌ను తీసుకుని, ఆవరణలో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూ కారును దొంగలించారు. అయితే మరుసటి రోజూ ఉదయాన్నే భగవాన్ ఇంటికి వెళ్లి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు.
గేటు తాళం పగలగొట్టి ఉండడం.. ఇంటి తలుపులు ధ్వంసం కావటం.. పెంపుడు కుక్క స్పృహ లేకుండా పడిపోయి ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురి అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంతో కలిసి సీఐ పి. శ్రీనివాస్, ఎస్సై మోహన్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, పాదముద్రలు, సీసీటీవీ ఫుటేజీ కోసం సమగ్రంగా శోధించారు. మత్తు మందు పెట్టబడిన కుక్కకు పశువైద్యుల ద్వారా చికిత్స అందించగా.. అది నెమ్మదిగా కోలుకుంటున్నట్లు తెలిపారు. దొంగతనం చేసిన కారు కోసం దొంగలు బహుశా ముందుగానే రేకి చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
గ్రామంలోని రహదారులు, సమీప పట్టణాలకు వెళ్లే మార్గాలు పరిశీలించేందుకు చెక్‌పోస్టులు అలర్ట్ చేసినట్లు సమాచారం. అలాగే ల్యాప్‌టాప్ ట్రాక్ చేయడం ద్వారా కూడా నిందితుల జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెంపుడు జంతువుకే మత్తు మందు వేసి నేరం చేసిన దొంగల ధైర్యం గ్రామంలో భయాందోళనలు పెంచింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్సై మోహన్‌కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications