సెంచరీ దాటి.. టమాటా, మిర్చి ధరలు ఇంకా పెరిగే ఛాన్స్.. కారణాలివే!!
నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందికరంగా మారుతుంది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అయితే కూరగాయల ధరలు ఇంతగా పెరగటానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం.
టమాట ధరలు, పచ్చి మిర్చి ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ప్రస్తుతం కిలో టమాట వంద రూపాయలకు చేరుకోగా, పచ్చిమిరపకాయలు కూడా వంద రూపాయలకు మించి ధర పలుకుతున్నాయి. సామాన్యులు దీంతో అంత ధర పెట్టి టమాటా, పచ్చి మిరపకాయలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం కేజీ టమాటా 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు మాత్రమే విక్రయించబడ్డాయి.

కానీ ప్రస్తుతం కేజీ టమాటా ధర 100 రూపాయలకు చేరుకుంది. 40 రూపాయల నుండి 60 రూపాయలకు లభించే పచ్చి మిర్చి ధరలు ఇప్పుడు ఏకంగా 120 రూపాయలకు చేరుకున్నాయి. టమాటా 75 రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో సెంచరీ దాటేసింది. టమాటా పంట దిగుబడి తగ్గడంతో రోజువారీ హోల్ సేల్ మార్కెట్ కు రావలసిన దానికంటే తక్కువగా టమాటాలు మార్కెట్ కు వస్తున్నాయి.
అసలు వారం రోజుల వ్యవధిలో ధరలు బాగా పెరగటానికి కారణం డిమాండ్. డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఉత్పత్తి లేక ధరలు పైకి పెరుగుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాల దెబ్బకు టమాటతో పాటు మిర్చి పంట బాగా నష్టపోయింది. మళ్లీ ఇప్పుడు టమాటా, మిర్చి కొత్త పంటలు వేశారు. అది మళ్ళీ కోత దశకు రావడానికి సమయం పడుతుంది.
అప్పటివరకు టమాట, మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో టమాట, మిర్చి ధరలు విపరీతంగా పెరగడం వెనుక కారణాలు ఇవేనని చెప్తున్నారు. మనరాష్ట్రంలో చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి టమాటాలు ఎక్కువ ఉత్పత్తి ఉండేది. లేదంటే బెంగళూరు నుండి దిగుమతి చేసుకోవాలి.
ప్రస్తుతం మన దగ్గర టమాటా దిగుబడి లేకపోవటంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ఏది ఏమైనా ఈ ధరాఘాతం శరాఘాతంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల పాలిట మారింది.కిలో కొన్నవాళ్ళు అరకిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.












Click it and Unblock the Notifications