Tirumala: తిరుమలలో వైభవంగా స్నపన తిరుమంజనం..
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతోన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. రంగనాయకుల మండపంలో వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం చేశారు. స్నపన తిరుమంజనం సందర్బంగా రంగనాయకుల మండపాన్ని పూలు, పండ్లతో అందంగా అలంకరించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సప్తగిరుల్లో లభ్యమయ్యే ప్రకృతి సిద్ధమైన ఫలపుష్పాలనే కాకుండా దేశ, విదేశాల నుంచి ఫలపుష్పాదులను తెప్పించి స్వామివారిని సర్వంగసుందరంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామరలతో వేదికను సుందరంగా అలంకరించారు.

విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం చేశారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి హోమాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పటించారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం స్వామివారిని 67,267 మంది దర్శించుకున్నారు. మరోవైపు తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. ఆ చిరుతను స్థానిక జూకు తరలించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కింది.












Click it and Unblock the Notifications