2024కు జగన్ ఏకైక నినాదం ఇదేనా ? దాంతోనే చావో రేవో ! పాత వాటికి చెల్లు ?
ఏపీలో ఎన్నికల నినాదాలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతిసారి ఎన్నికలకు రాజకీయపార్టీలు కొంగొత్త నినాదాలు సిద్ధం చేసుకుంటుంటాయి. వాటితోనే ప్రత్యర్ధులపై దాడి చేస్తుంటాయి. అసలే ఎన్నికల వ్యూహకర్తల సాయం కూడా తీసుకుంటున్న నేపథ్యంలో నినాదాలకు మరింత డిమాండ్ కూడా పెరిగింది. ఇదే క్రమంలో 2019 ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చిన రావాలి జగన్.. కావాలి జగన్ , బైబై బాబు నినాదాలు ఎంత పాపులర్ అయ్యాయో అంతా చూసారు. చివరికి అవే వైసీపీని భారీ మెజార్టీ దిశగా నడిపిస్తే టీడీపీని కుదేలు చేశాయి. దీంతో ఈసారి జగన్ ఏ నినాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్నారనే చర్చ జరుగుతోంది.

2019లో జగన్ నినాదాలు
2019 ఎన్నికల్లో వైసీపీని అప్పటి అధికార పక్షం టీడీపీకి దీటుగా నిలబెట్టడంలో నినాదాలు కీలక పాత్ర పోషించాయి. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బైబై బాబు నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అలాగే ఈ నినాదాన్ని డిజిటల్ సైన్ బోర్డులపై వేయించి బైబై బాబుకు ఇంకా ఎన్ని రోజులు, గంటలు, నిమిషాలు ఉన్నాయో జనానికి తెలిసేలా వైసీపీ కార్యాలయాలపై క్లాక్ లు ఏర్పాటు చేశారు. దీంతో జనంలోనూ అదే భావన కలిగింది. ఆ తర్వాత వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో రావాలి జగన్-కావాలి జగన్ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే బైబై బాబుకు కనెక్ట్ అయిన జనం.. ఆ తర్వాత రావాలి జగన్-కావాలి జగన్ నినాదాన్ని కూడా ఆదరించారు. దీంతో వైసీపీ పని సులువైంది. టీడీపీ దారుణంగా దెబ్బతింది.

2024కు కొత్త నినాదాల వేట
2019లో టీడీపీ అధికారంలో ఉంది. వైసీపీ విపక్షంలో ఉంది. కాబట్టి అప్పుడు ఆ నినాదాలు పనికొచ్చాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీ విపక్షంలో ఉంది. టీడీపీకి తోడు జనసేన కూడా సిద్దమవుతోంది. బీజేపీ బహిరంగంగా వైసీపీని సమర్ధించే పరిస్ధితి లేదు. దీంతో 2024లో జగన్ ఏ నినాదంతో జనంలోకి రాబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే ఏదో ఒక నినాదం మాత్రం ఖాయం. అదేంటన్న చర్చకు వైసీపీ వర్గాలు చెప్తున్న మాట ఒకటే. ఆ ఒక్క నినాదంతోనే జగన్ ఈసారి ఎన్నికలు గెలవబోతున్నారట. దాంతోనే ప్రత్యర్ధుల్ని జనంలో పలుచన చేయబోతున్నారట. అదేంటో తెలుసా..?

ఈసారి జగన్ ఏకైక నినాదమిదే ?
2024లో ఎన్నికలకు జగన్ సిద్ధం చేసుకుంటున్న ఏకైక నినాదం "వైసీపీ లేకపోతే పేదలకు నష్టం". ఎందుకంటే వైసీపీ సర్కార్ ఇప్పుడు పేదలకు భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలుచేస్తోంది. ఈ మూడేళ్లలోనే 2 లక్షల కోట్ల వరకూ వివిధ పథకాలతో, వివిధ రూపాల్లో సాయం అందించింది. ఇప్పటికీ దాన్ని విజయవంతంగా అమలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీ ఒకవేళ గెలవకపోతే పేదలకు ఆ సాయం అందదన్న భావన కచ్చితంగా ఉండాలి. అప్పుడే వైసీపీకి వారు మరోసారి గంపగుత్తగా ఓట్లు వేస్తారు. అలా కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నా తమకు పథకాలు తప్పనిసరిగా లభిస్తాయన్న భావన కలిగితే మాత్రం వైసీపీకి తీవ్ర నష్టం తప్పదు. అందుకే ఇప్పుడు జగన్ వైసీపీ రాకపోతే పేదలకు నష్టం అనే డైలాగ్ ను జనంలోకి తీసుకెళ్లడం ప్రారంభించారు. ఇప్పటికే తాజా కేబినెట్ భేటీలో సైతం ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం జగన్ చెప్పేశారు.












Click it and Unblock the Notifications