మా MLA కనపడి మూడున్నర సంవత్సరాలవుతోందయ్యా.. !?
తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ మూడున్నర సంవత్సరాల్లో నియోజకవర్గంవైపు కన్నెత్తి చూస్తే ఒట్టు అంటున్నారు ఇక్కడి ప్రజలు. పార్టీ అధికారంలో లేకపోయినా తమ సమస్యలను పట్టించుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన గంటా శ్రీనివాసరావుకు ఓటువేసి తప్పు చేశామని స్థానికులు అంగీకరిస్తున్నారు.

అధికారంలో ఉన్న పార్టీలోనే ఉంటారు?
అధికారంలో ఉన్న పార్టీలోనే ఉంటారు అనే విమర్శను ఎదుర్కొనే గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తు కోసం మరోసారి కాపులను ఉపయోగించుకోబోతున్నారని కాపునాడు నేతలు మండిపడుతున్నారు. డిసెంబరు 26వ తేదీన వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా విశాఖలో కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను పదిరోజుల క్రితమే గంటా ఆవిష్కరించారు. దీంతో తనకు సంబంధం లేదని చెప్పినప్పటికీ రాజకీయ స్వలాభం కోసం ఆయనే దీని ఏర్పాటు వెనక ఉన్నారని కాపునాడు నేతలు చెబుతున్నారు.

హఠాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చాం?
కాపు నాయకులు ఆదర్శంగా తీసుకునే వంగవీటి రంగాకు వారసుడు ఉన్నారని, ఆయనతో కలిసి కాపులను ఆదుకోవడంతోపాటు ఆర్థికంగా వెనకబడిన కాపు వర్గాలకు చేయూతనివ్వడంలాంటివి ఏనాడూ చేయని గంటా శ్రీనివాసరావుకు ఈరోజు వంగవీటి రంగాకానీ, కాపులుకానీ హఠాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చామని ప్రశ్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకైనా, తెలుగుదేశం పార్టీకైనా కాపుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఒకరకంగా వచ్చే ఎన్నికల్లో కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు.

కాపుల కోసం వైసీపీ, టీడీపీ పోటాపోటీ!
కాపులను మంచి చేసుకోవడం కోసం వైసీపీకానీ, తెలుగుదేశం కానీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఈ పొత్తు కుదరనీయకుండా వైసీపీ రాజకీయం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే వైసీపీలో ఉన్న కాపు నాయకులకు మంచి ప్రాధాన్యం ఇవ్వడంద్వారా, పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అని ప్రచారం చేయడం ద్వారా కాపులను ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. దీంతో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారిన కాపు ఓటుబ్యాంకుకు సంబంధించి గంటా శ్రీనివాసరావు రాజకీయాలు మొదలుపెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రజలవైపు తొంగిచూసిన దాఖలాలే లేవని, అటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా కాపులకు చేసేదేమీ లేదని, సామాజికవర్గాన్ని తన రాజకీయం కోసం ఉపయోగించుకోవడానికేనంటూ కాపునాడు నేతలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications