అమరావతిలో 'అన్నా క్యాంటీన్': చంద్రబాబు మరో తప్పటడుగు వేశారా?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అమరావతిలో వీటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని రెండు రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో జనాదరణ పొందిన 'అమ్మ క్యాంటీన్ల' తరహాలో 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రమంత్రులు తమిళనాడు వెళ్లి అక్కడి క్యాంటీన్ల పనితీరును పరిశీలించారు. మంగళవారం గుంటూరులో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అన్న క్యాంటిన్ల నిర్వహణపై చర్చించారు.
అన్న క్యాంటిన్లలో భోజనంతో పాటు టిఫిన కూడా పెట్టాలా? ఎవరికీ ఆ కాంట్రాక్టు అప్పగించాలి తదితర అంశాలపై ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం చర్చించినట్లుగా సమాచారం. ఇలా చివరికి అన్నా క్యాంటీన్లను కూడా అమరావతిలోనే తొలుత ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

సమైక్య రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేసి కేవలం ఒక్క హైదరాబాద్‌నే అభివృద్ధి చేసిన విధంగానే చంద్రబాబు నిర్ణయాలన్నీ అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయని మండిపడుతున్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు, పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అమరావతికే మళ్లిస్తూ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
నిజానికి అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేయడం వెనుక ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజలకి తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందించడం. కానీ ఆ ప్రయోజనం నెరవేరాలంటే రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే వాటిని ముందుగా ఏర్పాటు చేయాలి.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా దానిని తొలుతు రాజధాని అమరవాతి ప్రాంతానికి కేటాయించడం మంచి పద్ధతి కాదంటున్నారు. రాష్ట్రంలో అమరావతి తప్ప వేరే జిల్లాలు లేనట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి. అలాంటి జిల్లాలో ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత మేరకు మేలు జరుగుతుంది. అలా కాకుండా ఎప్పుడూ అమరావతిపైనే దృష్టి కేంద్రీకరించి, దానినే అభివృద్ధి చేసుకొంటూపోతే మళ్ళీ చరిత్ర పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.












Click it and Unblock the Notifications