విశాఖకు సీఎం జగన్ - వెంకయ్య నాయుడు ఇంట వేడుకలో: నేటికి రెండేళ్లు - అక్కడకు చంద్రబాబు..!!
ఏపీ రాజకీయాల్లో ఈ రోజున ఆసక్తి కర అంశాలు చోటు చేసుకోనున్నాయి. ఏపీ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి నేటికి రెండేళ్లు. దీంతో..ఈ రోజున అమరావతి జేఏసీ తిరుపతిలో నిర్వహించే సభలో మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పలు పార్టీల నేతలు హాజరు కానున్నారు. ఇక, ఇదే రోజున ముఖ్యమంత్రి జగన్ తాను ప్రకటించిన పరిపాలనా రాజధాని విశాఖ పర్యటనకు బయల్దేరుతున్నారు. విశాఖలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరు కానుండటంతో మరో ఆసక్తి కర అంశంగా మారుతోంది.

విశాఖ పర్యటనకు సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం 4:10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రూ. 247కోట్లతో చేపట్టిన 12 అభివృద్ది ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం.. ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్ తో పాటు వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు సీఎం జగన్ హాజరవుతారు.

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించి రెండేళ్లు
6.20 గంటలకు ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4ప్రాజెక్ట్‌లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరు కానున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఒక సారి కలిసారు. ఆ తరువాత వారి ఇంట జరిగే వేడుకలో పాల్గొనటం ఇదే ప్రధమం.

వెంకయ్య నాయుడు ఇంట వేడకకు సీఎం జగన్
గత వారం హైదరాబాద్ లో జరిగిన వెంకయ్య నాయుడు మనవరాలు వివాహానికి గవర్నర్లు...తెలంగాణ సీఎం కేసీఆర్... టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఇక, ఆ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత సీఎం జగన్ రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇదే సమయంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబుతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు తిరుపతి కేంద్రంగా ఒకే వేదిక మీదకు రానున్నారు. అమరావతికి మద్దతుగా నిలవనున్నారు.

తిరుపతిలో అమరావతి సభలో చంద్రబాబు
జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వారంతా నినదించనున్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పదే పదే చెబుతోంది. ఇక, ఇప్పుడు జగన్ అటు విశాఖకు..చంద్రబాబు ఇటు అమరావతి సభ కోసం తిరుపతికి వెళ్తున్న సమయంలో ఏపీ రాజకీయాలు రాజధానుల చుట్టూ తిరగనున్నాయి. తిరపతి సభలో రాజకీయంగా ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications