విజయవాడకు లడఖ్ అమరవీరుల మృతదేహాలు-ఘన నివాళులు..!
చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద లడఖ్ సమీపంలో తాజాగా యుద్ధ ట్యాంకుతో బోధి నది దాటుతూ విన్యాసాలు నిర్వహిస్తున్న ఐదుగురు జవాన్లు అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. ఈ ఐదుగురిలో ముగ్గురు ఏపీకి చెందిన వారే ఉన్నారు. లడఖ్ ప్రమాదంలో అసువులు బాసిన ఈ ముగ్గురు అమర వీరుల మృతదేహాలు ఇవాళ విజయవాడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి స్వస్థలాలకు వీటిని చేరుస్తున్నారు.
గత వారం లఢఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమరవీరుల మృతదేహాలు ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా సైనికులు శవపేటికలకు గౌరవ వందనం సమర్పించారు. లడఖ్ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతిచెందారు.

అలాగే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) ప్రాణాలు కోల్పోయారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది పాప కూడా ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా పనిచేస్తున్నారు. వీరితో పాటు బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ కూడా మరణించారు. ఇతను 17ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో సేవలందిస్తున్నారు. ఈ ముగ్గురి మృతదేహాలకు ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం స్వస్థలాల్లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.












Click it and Unblock the Notifications