వైసీపీ వ్యతిరేకత పెద్దిరెడ్డి మీద ఇంత పడింది, ఆ ముగ్గురు చేసిన పనికి టీడీపీ ఔట్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెబ్బకు గత వైసీపీ ప్రభుత్వం గల్లంతు అయ్యింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇద్దరూ రాయలసీమ ప్రాంతాలకు చెందినవారే. ఇదే రాయలసీమలో అనేక జిల్లాల్లో వైసీపీ బోణీ కొట్టలేకపోయింది. అయితే చంద్రబాబు సొంత జిల్లాలో ముగ్గురు వ్యక్తుల వలన వైసీపీ బోణీ కొట్టింది.
ఆ ముగ్గురు వ్యక్తుల కారణంగా ఓట్లు చీలిపోవడంతో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజక వర్గంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ముగ్గురిలో సగం ఓట్లు టీడీపీ పడివుంటే పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్ర యాదవ్ విజయం సాధించి ఉండేవారు. అయితే పుంగనూరులో పెద్దిరెడ్డి హవా తగ్గిందా ?, వైసీపీ వ్యతిరేక ఓటు పనిచేసిందా అని అంతు చిక్కడం లేదు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెబ్బకు రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వైసీపీ బోణీ కొట్టలేకపోయింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఒక్క పుంగనూరు మినహా అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ పాగా వేసింది. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ప్రభావం పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద కూడా చూపించడంతో ఆయన వర్గీయులు హడలిపోయారు. గతంతో పోల్చుకుంటే దాదాపు 80 శాతం మెజారిటీ తగ్గిపోవడంతో పెద్దిరెడ్డి కూడా షాక్ అయ్యారని తెలిసింది.
పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి (చల్లా బాబు) ఓడిపోవడానికి మరో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు పరోక్షంగా కారణం అయ్యారు. పెద్దిరెడ్డి అరాచకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ మొదటి నుంచి ఆయన్ను వ్యతిరేకిస్తున్న బోడే రామచంద్ర యాదవ్ ఇంతకాలం ఆయన వర్గీయుల మీద సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. పెద్దిరెడ్డి దెబ్బను తట్టుకుని నిలబడటానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లిన రామచంద్ర యాదవ్ సాయుధ బలగాలను ఆయన కుటుంబ భద్రత కోసం రప్పించుకున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన రామచంద్ర యాదవ్ కు సుమారు 15 వేల ఓట్లు వచ్చాయి. అయితే ఈసారీ కొత్త పార్టీ పెట్టుకుని పోటీ చేసిన రామచంద్ర యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడంతో ఆయనకు కేవలం 4, 559 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే పుంగనూరులో ఎస్ డీపీఐ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్వర్ బాషాకు 1, 906 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మురళి మోహన్ కు 3, 571 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు అన్ని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్ది వ్యతిరేక ఓట్లు అని పుంగనూరు నియోజక వర్గం ప్రజలు అంటున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా ఈ ముగ్గురికి పడిన ఓట్లు మొత్తం 12,130 ఓట్లు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 43,555 ఓట్ల మెాజరిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి జగన్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మంత్రిగా పని చేశారు. అయితే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సుమారు 6000 మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. పుంగనూరులో పెద్దిరెడ్డి విజయంతో చిత్తూరు జిల్లాలో వైసీపీ బోణీ కొట్టింది.
అయితే పుంగనూరులో పోటీ చేసిన ముగ్గురు వ్యక్తుల సంపాధించిన 12,130 ఓట్లలో సగం పెద్దిరెడ్డి వ్యతిరేక ఓట్లు అంటే (6 వేలకు పైగా వస్తాయి ) టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డికి వచ్చి ఉంటే పుంగనూరులో కూడా టీడీపీ జెండాలు రెపరెపలాడేవి అని కూటమి కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మీద కూడా పడటంతో దాదాపుగా ఆయనకు 38, 000 ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది. పెద్దిరెడ్డి మెజారిటీ తగ్గిపోవడంతో పుంగనూరులో ఆయన వర్గీయులు ఆ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications