Tdp Vs Ysrcp: తెలుగుదేశం వైపు చూస్తున్న ముగ్గురు కోస్తాంధ్ర ఎంపీలు?
కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పొసగకపోవడమే దీనికి కారణమవుతోంది. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో విజయావకాశాలుంటాయన్న ఆలోచన కూడా వారిని తెలుగుదేశంవైపు చూసేలా ప్రేరేపిస్తోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితిని చూస్తే ఏ క్షణంలోనైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా అక్కడి వాతావరణం ఉంది.

రెబెల్ ఎంపీగా కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ రెబెల్ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీ పరంగా ఆయనపై అనర్హత వేటు వేయడానికి సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో వైసీపీ కూడా మౌనం వహించింది. ఆయన పార్టీమారడం ఖాయం. తెలుగుదేశం పార్టీలోకి వస్తారంటూ ఆయన అనుయాయులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయన ప్రత్యక్షంగా మద్దతిస్తున్నారు.
రెండున్నర సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్న రఘురామ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా తన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఆయన పార్టీ మారడం ఖాయం. దాదాపుగా తెలుగుదేశం పార్టీలోనే చేరి నరసాపురం నుంచి పోటీచేయబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అధిష్టానంపై అసంతృప్తితో లావు కృష్ణదేవరాయలు
నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి. కానీ ఆయన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం ఆయన్ను కలుపుకుపోవడంలేదు. ముఖ్యంగా విడుదల రజని (చిలకలూరిపేట), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ)తో ఆయనకు తరుచుగా వివాదాలు నెలకొంటున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు, నరసరావుపేటలో జరిగిన బహిరంగసభకు ఆయన దూరంగా ఉన్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ పార్టీ పరంగా ఎటువంటి మద్దతు లభించకపోవడంతో ఆయన పార్టీ మారడం దాదాపుగా ఖాయమైనట్లేనని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు.

ప్రోటోకాల్ వివాదాలతో మాగుంట అసంతృప్తి
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు లెక్కచేయకపోవడం, ప్రోటోకాల్ వివాదాలుండటంతోపాటు గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చిందని శ్రీనివాసరెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఆయన పార్టీ మారడం లాంఛనమేనని చెబుతున్నారు. ఒంగోలు నుంచి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉన్నట్లు రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications