బీచ్‌కెళ్లి వస్తున్న నవ దంపతులపై బీర్ సీసాలతో దాడి
తూర్పు గోదావరి: జిల్లాలోని పిఠాపురం-గొల్లప్రోలు వద్ద బుధవారం అర్థరాత్రి నవ దంపతులపై దాడి చేసిన దుండగులు బీభత్సం సృష్టించారు. రాత్రి సమయంలో వస్తున్న నవ దంపతులపై మద్యం సీసాలతో దాడిచేసి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే.. గొల్లప్రోలు మండలానికి చెందిన తాతపూడి సురేష్, జయ దంపతులు బుధవారం కాకినాడ వెళ్లారు. ఈ క్రమంలో ఆరోజు మధ్యాహ్నం సినిమా చూసి సాయంత్రం బీచ్‌కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో జయకు కడుపులో నొప్పి రావడంతో శోంటవారిపాకలు సమీపంలో విశ్రాంతి కోసం ఆగారు.

ఆ సమయంలో వెనుక నుంచి బైక్‌పై మద్యం తాగుతూ వస్తున్న ఇద్దరు దుండగులు వీరిపై దాడి చేశారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, ఉంగరాలు, వెండిపట్టీలు దోచుకున్నారు. ఈ దాడిలో జయను దుండగులు బీర్ సీసాతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిఠాపురం పోలీసులు తెలిపారు.
10 వాహనాలను దోచుకున్న దొంగలు
గుంటూరు జిల్లాలోనూ దారి దోపిడీ దొంగలు బీభత్సం సృస్టించారు. సుమారు 10 వాహనాను అడ్డగించిన దుండగులు వారి వద్ద ఉన్న సొత్తును దోచుకెళ్లారు. ఈ సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ అడ్డరోడ్డు సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
నందిగామ అడ్డరోడ్డు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి అటుగా వచ్చిన 10 వాహనాలను దోచుకున్నారు. ఇప్పటికే ముగ్గురు బాధితులు పోలీసులను సంప్రదించారు. కాగా, నిందితులు ఆ దారిలో వచ్చిన వారిని అడ్డగించి కత్తి, గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో ప్రయాణికులను బెదిరించి దోచుకున్నారని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications