ఏపీలో ప్రతీ శనివారం వారికి ఇళ్ళు.. శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పేదల కోసం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తామని సమాధానం చెప్పారు.
టిడ్కో ఇళ్ళపై మంత్రి నారాయణ సమాధానం
ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడిన మంత్రి నారాయణ 2026 జూన్ నెలాఖరు లోపు రాష్ట్రంలోని 2 లక్షల 61 వేల 640 టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ దిశగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైనా సరే టిడ్కో ఇల్లు పూర్తి అయితే ప్రతి శనివారం వాటిని లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించినట్లు గా మంత్రి నారాయణ పేర్కొన్నారు.

టిడ్కో ఇళ్ళ కోసం 7280 కోట్ల రూపాయలు
ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు కూడా జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం, అలాగే కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన పెండింగ్ బకాయిలను ఇవ్వడం కోసం, టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక వసతుల కల్పన కోసం 7280 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఈ నిధులను తాము వివిధ బ్యాంకుల నుంచి రుణాలు రూపంలోనూ, హడ్కో ద్వారాను సమీకరిస్తున్నామని ఆయన అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో కేంద్రం టిడ్కో ఇళ్ళ కేటాయింపు
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం కేటాయించిన ఇళ్లను కూడా వైసిపి ప్రభుత్వం కట్టలేక పోయిందని ఆయన ఆరోపించారు. 2014-2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 7 లక్షల1వెయ్యి 481 టిడ్కో ఇళ్లను కేటాయిస్తే, వీటిలో సుమారు 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయని, ఆపై ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారని పేర్కొన్నారు.
ప్రతీ శనివారం లబ్దిదారులకు పూర్తయిన ఇళ్ళు
గత వైసీపీ ప్రభుత్వం వీటిని 2,61,640కి తగ్గించిందని, ఆ ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదని మంత్రి నారాయణ ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ఇక పూర్తయిన ఇల్లు ప్రతీ శనివారం లబ్ధిదారులకు అందిస్తామని సభా వేదికగా మంత్రి నారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications