వెంకటేశ్వర స్వామికి కల్తీ ప్రసాదం పెట్టాను.. మా జీవితంలో మరిచిపోలేని బాధ - రమణ దీక్షితులు

తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సీబీఐ-సిట్ విచారణకు దారితీసిన ఈ వివాదం... తాజాగా తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలతో మరింత తీవ్ర స్థాయికి చేరింది. గత ఐదేళ్లుగా తిరుమలలో జరుగుతున్న అవకతవకలను ఆయన బహిరంగంగా బయటపెట్టడంతో ఈ వ్యవహారం కేవలం పరిపాలనా లోపం కాకుండా... ఆగమ శాస్త్రానికి విరుద్ధమైన అపచారంగా మారిందన్న చర్చ మొదలైంది.

మీడియా సమావేశంలో రమణ దీక్షితులు భావోద్వేగంగా స్పందించారు. "లడ్డూలో నాటి కమ్మని వాసన లేదు, నాణ్యత లేదని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదమే కాదు... స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా కల్తీ అయింది. ఇది మహా పాపం. మా చేతులతోనే స్వామివారికి కల్తీ నెయ్యితో చేసిన నైవేద్యం పెట్టాల్సి రావడం మా జీవితంలో మరిచిపోలేని బాధ" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tirumala Laddu Controversy Deepens as Chief Priest Alleges Adulteration in Naivedyam During Past Five Years

గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ నాణ్యత మాత్రమే కాదు... పరిమాణం కూడా సగానికి సగం తగ్గించారని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. "అలా తగ్గించడం ఆగమ శాస్త్ర విరుద్ధం. ఇది అపచారం అని ఎంత చెప్పినా అప్పటి ఈవో గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు" అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కాలంలో లడ్డూ పరిమాణం తగ్గించినప్పుడు తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా...

స్వామివారికి ఎంత పరిమాణంలో నైవేద్యం పెట్టాలన్నది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుందని, దానిని 'దిట్టం' అంటారని రమణ దీక్షితులు వివరించారు. "దిట్టం ప్రకారం ఎక్కువ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ చేయవలసినదానికంటే తక్కువ చేయడం మాత్రం అపచారం. మొన్నటి వరకూ అదే జరుగుతోంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు" అని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి... దిట్టం ప్రకారమే ప్రసాదం తయారు చేయాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

శాస్త్ర విరుద్ధం..

తాను కైంకర్యాలు చేసిన రోజుల్లో గరుడ సేవ సందర్భంగా సుమారు 100 గంగాళాల నైవేద్యం స్వామివారికి సమర్పించేవారని గుర్తు చేశారు. "నైవేద్యానికి అప్పర్ లిమిట్ అనేది లేదు. కానీ తగ్గించడం మాత్రం శాస్త్ర విరుద్ధం. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి" అని హితవు పలికారు. నైవేద్యం అనేది కేవలం ఆహారం కాదని... అది భక్తి, నమ్మకం, శుద్ధతతో కూడిన ప్రక్రియ అని రమణ దీక్షితులు వివరించారు. "సుచిగా, శుభ్రంగా, తాజా గానూ స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే స్వామి ప్రసన్నులు అవుతారు. అప్పుడు భక్తులకు మాత్రమే కాదు... రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు జరుగుతుంది" అన్నారు.

దేశం శుభిక్షంగా ఉంటుంది..

నైవేద్యంలో ఉన్న సారాన్ని స్వామి గ్రహించి అనుగ్రహంగా భక్తులకు కరుణిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "అప్పుడు అతివృష్టి, అనావృష్టి, కరువు, రోగభయం, యుద్ధ భయం, చోర భయం వంటి విపత్తులు దరిచేరవు. దేశం శుభిక్షంగా ఉంటుంది" అని చెప్పారు.

మొత్తానికి... తిరుమల లడ్డూ కల్తీ వివాదం ఇప్పుడు పరిపాలనా తప్పిదం స్థాయిని దాటి, ఆధ్యాత్మిక అపచారంగా మారిందన్న భావన బలపడుతోంది. ప్రధాన అర్చకుడే బహిరంగంగా చేసిన ఈ వ్యాఖ్యలు... ఈ కేసును ఎక్కడికి తీసుకెళ్తాయోనన్న ఉత్కంఠ ఇప్పుడు భక్తుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+