విన్నపాలు వినవలె... రైల్వేకు శ్రీవారి భక్తుల స్పెషల్ రిక్వెస్ట్!
కలియుగ ప్రత్యక్ష దైవం శేషాచల కొండలలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది ప్రజలు తిరుమల శ్రీవారి ఆలయానికి వెళుతుంటారు. ఇక అటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు కావలసిన వసతులను కల్పించడంలో టిటిడితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ, అలాగే రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు విస్తృతమైన ఏర్పాట్లను చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వారి అవసరాలను తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
తిరుమల శ్రీవారి భక్తుల విన్నపం
అయితే తాజాగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు రైల్వే శాఖకు ఒక కీలక విజ్ఞప్తిని చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులను కలిగి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి దర్శనం కోసం వెళ్లే భక్తులు రేణిగుంట రైల్వే స్టేషన్ విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి చేస్తున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్ లో చిన్నపాటి వర్షం పడినప్పటికీ వర్షపునీరు నిలిచిపోతుందని, చిన్నపాటి నీటి గుంటలాగా ఆ ప్రాంతం మారుతుందని చెబుతున్నారు.

వర్షపు నీరు, మురుగు నీటితో అక్కడ ఇబ్బంది
భక్తులు వర్షపు నీళ్లలో నుండే నడవాల్సిన పరిస్థితి వస్తుందని తిరుమలకు వెళుతున్న శ్రీవారి భక్తులు వాపోతున్నారు.భారతదేశంలో భౌగోళికంగా నలు దిక్కులకు ప్రయాణించడానికి సామర్థ్యం కలిగి ఉన్న మేజర్ జంక్షన్ అయిన రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం బయట వర్షం పడితే వచ్చే వర్షపు నీరు అలాగే అక్కడ వినియోగించే వ్యర్ధ జలాలు పోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
మురుగు నీళ్ళలో నుండే భక్తుల నడక అగచాట్లు
మురికి కాలువలలోని మురుగునీరు వర్షపు నీటితో కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం మురుగునీటి గుంటను తలపిస్తుందని వారు చెప్తున్నారు. ఈ మురుగునీటి గుంటలో నుండి నడుచుకుంటూ వెళ్లాలంటే భక్తులకు అసౌకర్యంగా ఉందని వారు వాపోతున్నారు. దీనిపైన రైల్వే అధికారులు చొరవ చూపించాలని వారు కోరుతున్నారు.
వర్షానికి మురికి నీటి గుంటగా మారిపోయిన రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణం..!#Renigunta #ReniguntaRailwayStation #Tirupati #APRains #WeatherReport #AndhraPradesh #FengalCyclone #CycloneFengal #Oneindiatelugu pic.twitter.com/9ynTTpgdol
— oneindiatelugu (@oneindiatelugu) December 1, 2024
తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్న తిరుమల భక్తులు
మురుగునీటి గుంటను తలపిస్తున్న రేణిగుంట రైల్వే స్టేషన్ పరిసరాలలో నీరు నిలవకుండా తక్షణ పరిష్కారం కోసం ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరుతున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు కలుగుతున్న ఈ అసౌకర్యం నేపథ్యంలో భక్తుల విన్నపాలు రైల్వే వింటుందా, మరి ఈ విషయంలో రైల్వే ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications