తిరుపతి పోలింగ్: దొంగ ఓట్లు, ధర్నాకు దిగిన శ్రీదేవి
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉప ఎన్నికపోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 256 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తెలుగుదేశం అభ్యర్థి సుగుణమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వెబ్ కెమెరాల ద్వారా జిల్లా కలెక్టర్ ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నాం 12గంటల వరకు 27శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే తిరుపతిలో జరుగుతున్న ఉపఎన్నికపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

తిరుపతి ఉపఎన్నికలో ప్రత్యర్ధులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవి అరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. తిరుపతిలోని నెహ్రూ నగర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తున్న వారిని ఎందుకు అడ్డుకోవడం లేదంటూ ధర్నాకు దిగారు.
పోలింగ్‌లో అధికార పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలూ అక్రమాలకు పాల్పడుతున్నారని స్వతంత్ర అభ్యర్ధులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగం, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. నగరంలోని జీవకోనలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు వారిద్దరు యత్నించారని, ఆ కారణం చేత వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉప ఎన్నికలో ఓటింగ్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో చాలా మంది ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యారు. మూడొంతులకు పైగా ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా, చాలా మందికి అవి అందలేదని తెలుస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో ఓటు వేసినా... ఇప్పుడు ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించలేదంటూ పలువురు వాపోయారు.
దీంతో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 15న మరణించారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా వెంకటరమణ సతీమణి సుగుణమ్మను నిలిపింది. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుని ప్రకటించింది.












Click it and Unblock the Notifications