తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

కాగా మృతుల కుటుంబాల వారిని రుయా ఆసుపత్రి వద్ద పలువురు మంత్రులు పరామర్శించారు. వారిని ఓదార్చారు. దుర్ఘటనకు సంబంధించి మృతుల బంధువుల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోన్నామని తెలిపారు.
రెవెన్యూ- తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో ఉన్నారు.
ఆ సమయంలో వారి వెంట చంద్రగిరికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బరాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి గౌతమి, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ వారి వెంట ఉన్నారు.
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. గాయపడ్డ వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని మంత్రులు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications