తిరుమల శ్రీవారి సేవల్లో మార్పులు: 17 నుంచి.. !!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 67,124 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,069 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.77 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
మూడు కంపార్టుమెంట్లల్లో..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మూడు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

సేవల్లో మార్పు..
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి సేవల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశురాలను నివేదిస్తారు. ధనుర్మాసారంభం కావడమే దీనికి కారణం. జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై కొనసాగిస్తారు.
శ్రీవారి మాసోత్సవాల్లో..
శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు ధనుర్మాసానికి. ఈ నెల డిసెంబరు 16వ తేదీన తెల్లవారు జామున 6:57 నిమిషాలకు ధనుర్మాస ఘడియలు ఆరంభమౌతాయి. 17వ తేదీ నుండి స్వామివారికి తిరుప్పావై పాశురాలతో నివేదిస్తారు. జనవరి 14వ తేదీన ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ఆ తరువాత యధాతథంగా సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు.
శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ
శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
విశేష కైంకర్యాలు..
ధనుర్మాసంలో శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు అర్చకులు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోసె, బెల్లం దోసె, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలతో పూజిస్తారు.
ఆండాళ్ తిరుప్పావై పారాయణం..
12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్ (గోదాదేవి) ఒకరు. నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధాల్లో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది.












Click it and Unblock the Notifications