టైటానియం స్కాం: 'సి' ఎవరు? జగన్ కాదా అని బాబు
హైదరాబాద్: టైటానియం కుంభకోణంలో మూడో వ్యక్తి 'సి'దే ప్రధాన పాత్ర అని తెలుగు మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అధికారులతో చర్చలు జరిపింది అతడేనని, వంద కోట్లకే పెద్దోళ్లిద్దరూ ఒప్పుకోగా.... ముడుపులు పెంచాలని చెప్పిందీ 'సి' పాత్రనేనట. ఆయన కంపెనీల్లోకి ముడుపుల ప్రవాహం వచ్చిందంటున్నారు. సి అంటే వైయస్ బంధువని ఎఫ్‌బిఐ ఛార్జీషీటులో పేర్కొంది. దీంతో ఆ సి ఎవరనే చర్చ సాగుతోంది.త
టైటానియం కుంభకోణంలో కెవిపి రామచంద్ర రావు, వైయస్ రాజశేఖర రెడ్డి.. మూడో వ్యక్తి 'సి'! అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) నమోదు చేసిన చార్జిషీట్లో ఈ 'సి' పేరు కనిపించిందంటున్నారు. సదరు 'సి' వైయస్‌కు బంధువని పేర్కొందట. ముడుపుల చర్చల్లో క్రియాశీలంగా పాల్గొన్నాడని వివరించిందని, టైటానియం ప్రాజెక్టు లైసెన్సులు ఇవ్వడానికి ముడుపులతోపాటు వాటాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడని పేర్కొందని వార్తలు వస్తున్నాయి.
ముడుపులను విదేశాల్లోని సదరు 'సి' కంపెనీలకు బదిలీ చేశారని ఎఫ్‌బిఐ చెప్పిందంటున్నారు. ఆ 'సి' ఎవరు!? ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

టైటానియం అనుమతులు మంజూరు చేయాలంటే 'సి' నియంత్రణలోని కంపెనీకి చెల్లింపులు చేసేలా, కాంట్రాక్టు కుదుర్చుకునేలా చక్రం తిప్పారని పేర్కొంటున్నారు. ప్రాజెక్టును ఓకే చేయించడానికి సంబంధించి భారత నాయకులు, అధికారులతో 'సి' సమావేశమయ్యారని వివరించారట.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని ప్రాజెక్టుకు అనుమతులు సాధించడానికి వైయస్‌కు సన్నిహిత బంధువైన 'సి'కి ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించడంతోపాటు ఆయన కంపెనీలకు ముడుపులు కూడా ముట్టజెప్పినట్టు ఎఫ్‌బిఐ ఆరోపించినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో వైయస్ సన్నిహితుడు కెవిపిని ఐదు రకాల అభియోగాల్లో నిందితునిగా పేర్కొన్న ఎఫ్‌బిఐ.. ముడుపుల బాగోతంలో 'సి' కీలక పాత్ర పోషించాడని తెలిపిందట. కాగా, టైటానియం కుంభకోణంలో వైయస్ సమీప బంధువుగా ఎఫ్‌బిఐ పేర్కొన్న వ్యక్తి జగన్ కాదా అని చంద్రబాబు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications