వైఎస్ జగన్ ఆదేశాలు బేఖాతర్: షూటింగులు క్లోజ్: హీరోల దారెటు?
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు భారీగా ఉండటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడింది. సినిమా ప్రియులు ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఓటీటీల వచ్చిన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సినిమా చూడ్డానికీ ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఫలితంగా- టికెట్ల రేట్లను తగ్గించామంటూ నిర్మాతలు పోస్టర్ల మీద ముద్రించాల్సి వస్తోంది. ఇలాంటి పరిణామాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు.

థియేటర్లకు ప్రేక్షకులు రావట్లే..
ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించడానికి నిర్మాతలు, హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేస్తోన్నా- ఆశించిన ఫలితాలు రావట్లేదు. సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయనే ఆందోళన నిర్మాతల్లో నెలకొని ఉంది. అదే సమయంలో సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరగడం మరింత దెబ్బకొట్టినట్టయింది. నటీనటుల రెమ్యునరేషన్ కూడా దీనికి తోడయింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా హీరోలు కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్‌ను తీసుకుంటోన్నారు.

ఆచార్య.. ఓ ఉదాహరణ..
మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ నటించిన ఆచార్య డిజాస్టర్ తరువాత టాలీవుడ్‌లో ఎలాంటి పరిణామాలు సంభవించాయో తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో 50 కోట్ల రూపాయలను వడ్డీగా కట్టాల్సి వచ్చిందంటూ స్వయంగా చిరంజీవి చెప్పడం- నిర్మాణ వ్యయం ఏ స్థాయిలో తడిచి మోపెడయిందనేదీ సుస్పష్టమైంది. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో బయ్యర్లు రోడ్డున పడ్డారు. రోడ్డూ ఎక్కారు. దీని తీవ్రత- ఆ మూవీ దర్శకుడు కొరటాల శివ ఇంటి వద్ద ధర్నా చేయాలనే నిర్ణయాన్ని తీసుకునేంత వరకూ వెళ్లింది.

ప్రొడ్యూసర్స్ గిల్డ్..
ఈ పరిణామాల మధ్య టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుందంటూ వార్తలు వస్తోన్నాయి. షూటింగులన్నింటినీ ఆపేయాలని నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం షూటింగ్ లు ఆపేయడం వల్ల తమ అసంతృప్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్టవుతుందనే అభిప్రాయం నిర్మాతల్లో నెలకొన్నట్లు చెబుతున్నారు. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్స్ సైతం ఆర్థికంగా భారాన్ని మిగిల్చేవే కావడం వల్ల షూటింగులను నిలిపివేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇచ్చినా
ఇదివరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- టాలీవుడ్ నిర్మాతలకు పలు రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో సినిమా షూటింగ్‌లు చేస్తే- దానికి అనుగుణంగా సింగిల్ విండో ద్వారా అనుమతులు, రాయితీలను ఇస్తామంటూ గతంలో హామీలు ఇచ్చింది. ఆ తరువాత ఏపీలో సినిమా షూటింగులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే సాగాయి. ఇప్పుడు తాజాగా నిర్మాణ వ్యయం భారం పేరుతో నిలిపివేయాలంటూ నిర్ణయానికి రావడం జగన్ సర్కార్‌కు షాక్ ఇచ్చినట్టేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications