'తమ్ముడు'సహా మోడీ పావులు: చిరంజీవి ఒంటరి పోరు!
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అత్యధిక స్థానాల్లో గెలుచుకునేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ బిల్లుకు మద్దతివ్వడం ద్వారా తెలంగాణలో, సీమాంధ్ర కోసం పోరాడటం ద్వారా సీమాంధ్రలో బిజెపి పట్టు పెంచుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులను ఆకర్షించి రాష్ట్రంలో పార్టీకి గ్లామర్ అద్ది ప్రజలను మరింతగా పార్టీ వైపు మళ్లించాలని చూస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైపు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆకర్షితులవుతున్నారు. విభజనతో ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ దాదాపు తుడిచి పెట్టుకుపోయింది. దీంతో కొత్త ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో గట్టెక్కేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని రంగంలోకి దింపింది. ఆయనను సీమాంధ్ర పార్టీ ప్రచార సారథిగా నియమించింది. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేసేందుకు చిరు ఆధ్వర్యంలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు బస్సుయాత్రలు చేపడుతున్నారు.

అయితే ఓ వైపు కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలోకి వెళ్తుండటం, మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు మోడీ వైపుకు వెళ్తుండటంతో చిరంజీవి గ్రూప్ (సీమాంధ్ర కాంగ్రెస్) పరిస్థితి చిన్నబోయినట్లుగా ఉందంటున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా టాలీవుడ్ ప్రముఖులు బిజెపి వైపు చూస్తుండటాన్ని సీమాంధ్ర కాంగ్రెసు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
సీమాంధ్రలో పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించగానే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి తొలి దెబ్బ తీశారు. పవన్ కాంగ్రెసు పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన టిడిపికి, బిజెపికి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. నాలుగు రోజుల క్రితం మోడీని కలిసిన పవన్ బిజెపికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు చిరు సహనటుడు నాగార్జున కూడా మోడీని కలిశారు.
తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని చెబుతూనే... మోడీ పైన నాగ్ ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో కమెడియన్ బ్రహ్మానందం కూడా మోడీని కలవనున్నారని అంటున్నారు. వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకే తాను మోడీని కలిశానని నాగ్ చెప్పారు. తద్వారా బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా అర్థమవుతోంది. టాలీవుడ్ ప్రముఖులను మోడీతో కలిపించడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోందని అంటున్నారు.
ఇక హాస్య నటుడు అలీ తెలుగుదేశం పార్టీ నుండి పోటీకి సిద్ధమయ్యారు. టిడిపికి ఇప్పటికే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, నారా రోహిత్, తారకతర్న, నటి కవిత తదితరులు సిద్ధంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే టిడిపిలో మరింత జోరు కనిపించడం ఖాయం. పొత్తులకు సిద్ధమవుతున్న టిడిపిలో ఇప్పుడు గ్లామర్ బాగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెసుకు మాత్రం చిరంజీవి ఒక్కరే ఉన్నారు. అయితే, ఎన్నికలు వేరు సినిమాలు వేరని, కాంగ్రెసు పార్టీనే ప్రజలు ఆదరిస్తారని కాంగ్రెస్ క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications