ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం లతో భేటీ కానున్న టాలీవుడ్ ప్రముఖులు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు (జూన్ 15, ఆదివారం) సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సినీ పరిశ్రమకు చెందిన 35 నుంచి 40 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశానికి ముందు వారు మొదట రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవనున్నారు. అనంతరం ఆయనతో కలిసి సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చల్లో పాల్గొననున్నారు.
ఈ భేటీలో ఏపీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్టు తెలిస్తోంది. గత కొంతకాలంగా సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీ వ్యవహారంపై చర్చలు నడుస్తున్నాయి. అద్దెల రూపంలో మూవీలను ప్రదర్శించడం సాధ్యం కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడం.. ఆ తర్వాత బంద్ నిర్ణయాన్ని వాయిదా వేయడం జరిగాయి.

థియేటర్‌ల బంద్ అంశంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. "కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారా?" అని సినీ ప్రముఖులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పవన్ సినిమాకి కావాలనే అడ్డంకులు సృస్థించడం కోసం ఆ నలుగురు అలా ప్లాన్ చేశారని కూడా టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. పలువురు నిర్మాతలు సైతం ఆ నలుగురం మేము కాదంటూ ఓపెన్ గానే స్టేట్ మెంట్స్ ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా థియేటర్‌ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాల మేరకు అధికారులు పలు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు.
ఈ పరిస్థితుల్లోనే ఏపీలో చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య సహకారం పెంపొందించేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. సీఎం సూచన మేరకు మంత్రి కందుల దుర్గేష్ సినీ ప్రముఖులకు ఆహ్వానం పంపారు. సమావేశం అనంతరం ఆయన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఇక ఈ సమావేశానికి హాజరయ్యే వారిలో దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్.ఎస్. రాజమౌళి, నాగ అశ్విన్‌లు ఉంటారని సమాచారం. అలానే నిర్మాతల్లో అశ్వినీదత్, దిల్‌రాజు, అల్లు అరవింద్, డివివి దానయ్య, కేవీ రామారావు హాజరు కానున్నారు. నటుల్లో నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్, మంచు మనోజ్, ఆర్.నారాయణమూర్తి, సీనియర్ నటుడు సుమన్, నేచురల్ స్టార్ నాని ఉంటారని భావిస్తున్నారు. అలానే ఇంకా పలువురు ప్రముఖులు సమావేశంలో పాల్గొననున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో పలువురు సినిమా థియేటర్ వ్యాపారంలోనూ ఉన్న కారణంగా, థియేటర్ సమస్యలపై చర్చలు మరింత బలంగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications