సీఐడీకి రాంగోపాల్ వర్మ షాక్.. అరెస్టు తప్పదా?
టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కూటమి సర్కార్ నమోదు చేసిన ఓ కేసులో ఇవాళ ఆయన సీఐడీకి ఝలక్ ఇచ్చారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. అదే సమయంలో తన లాయర్ ను పంపి కారణం చెప్పించారు. అలాగే తన హాజరుకు రెండు నెలలు గడువు కూడా కోరారు. దీంతో సీఐడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ పై వ్యూహం పేరుతో సినిమా తీసిన రాంగోపాల్ వర్మ..ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒంగోలు పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. దాదాపు 12 గంటలకు పైగా విచారణ జరిపారు. ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఉండటంతో విచారించి వదిలిపెట్టారు. అదే సమయంలో వర్మకు సీఐడీ నోటీసులు పంపింది.

గతంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది. దీంతో ఇవాళ వర్మ సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్మ విచారణను డుమ్మా కొట్టారు.
తాను షూటింగ్ లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు వర్మ సమాచారం ఇచ్చారు. తన లాయర్ ను సీఐడీ ఆఫీసుకు పంపి ఏకంగా 8 వారాల సమయం కావాలని వర్మ కోరారు. దీనిపై సీఐడీ అధికారులు తదుపరి నిర్ణయం తీసుకుబోతున్నారు. సీఐడీ విచారణకు హాజరు కాని వర్మను అరెస్టు చేయొద్దనే ఆదేశాలు లేనందున అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications