వైఎస్ఆర్ సీపీలో చేరిన సినీ రచయిత చిన్నికృష్ణ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే!
అమరావతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్, కడప జిల్లా రాజంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు అన్నపూర్ణమ్మ ఇటీవలే వైఎస్ఆర్ సీపీలో చేరగా.. గురువారం మరో ఇద్దరు ప్రముఖులు ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.

ముందు నుంచీ వైఎస్ఆర్ సీపీకి మద్దతు
సినీ కథా రచయిత చిన్నికృష్ణ ముందు నుంచీ వైఎస్ఆర్ సీపీ సానుభూతిపరునిగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన విలేకరుల సమావేశాలను పెట్టి మరీ.. జగన్ కు మద్దతుగా మాట్లాడారు. అయినప్పటికీ అధికారంగా పార్టీలో చేరలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ను విమర్శించిన సందర్భాల్లో చిన్ని కృష్ణ తెరమీదికి వచ్చేవారు. జగన్ కు మద్దతుగా మాట్లాడేవారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని కూడా కొన్ని సందర్భాల్లో చిన్నికృష్ణ చెప్పుకొన్నారు. రెండు రోజుల కిందటే ఆయన పవన్ పై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆంధ్రులను కొట్టి తరమేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలపై చిన్ని కృష్ణ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజాగా- ఆయన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ ను కలిశారు. ఆయన సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.

టికెట్ ఇవ్వలేదనే ఆగ్రహంతో.. టీవీ రామారావు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కూడా జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ తరఫున గెలిచిన ఆయనకు ఈ సారి టికెట్ దక్కలేదు. తన నియోజకవర్గం పరిధిలో కొత్త అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించే బాధ్యతను కూడా చంద్రబాబు నాయుడు ఆయనకే అప్పగించారు.

జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో
దీనితో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కొద్దిరోజుల కిందటే పార్టీని వీడారు. కొద్దిరోజుల కిందట ఆయన తాను ధరించిన పసుపురంగు చొక్కాను విప్పేసి, నల్ల కండువా కప్పుకొని నిరసన వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మొదట జనసేన పార్టీలో చేరుతారని భావించారు. టీడీపీ-జనసేన పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో టీవీ రామారావు తన మనసు మార్చుకున్నారు. జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.












Click it and Unblock the Notifications