మంట పుట్టిస్తున్న టమాటా, ఉల్లి
రాష్ట్రంలో సామాన్యులకు కూరగాయల ధరలు షాకిస్తున్నాయి. ఉన్నట్లుండి మార్కెట్లలో, రైతు బజార్లలో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. ప్రధానంగా టమాటా, ఉల్లి ఆకాశంకేసి చూస్తున్నాయి. కిలో ఉల్లి రూ.60కి పైగా చేరగా.. కేజీ టమాటా రూ.30కి పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పంటల సాగు తగ్గింది. ఈ ఏడాది కురవాల్సిన వర్షాల కంటే చాలా తక్కువగా కురిశాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం సాగుపై తీవ్ర ప్రభావం చూపింది.
ఇతర రాష్ట్రాల్లోనూ కొత్తగా సాగు చేసిన ఉల్లి పంట దిగుబడి ఆశాజనకంగా లేదు. దీనివల్లే ధరలు పెరుగుతున్నాయంటున్నారు. సాగు తగ్గి ఉత్పత్తి పడిపోతుండటంతో ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. కిలో ఉల్లి రూ.40 ఉండగా ఇప్పుడు రూ.60కు చేరింది. టమాటా ధర సైతం కిలోపై 50 శాతం పెరిగింది. రూ.11 నుంచి రూ.15 మధ్యలో ఉండగా తాజాగా రూ.30కు చేరింది.

టమాటా సాగు ఏపీలో ఎక్కువ. దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో రాష్ట్రం నిలిచింది. అయితే రైతులు సాగు తగ్గించుకోవడంతో ఖరీఫ్ తో పోలిస్తే ఈసారి తగ్గింది. మదనపల్లి మార్కెట్ కు పదిరోజుల నుంచి టమాటా రావడం తగ్గింది. నాణ్యతనుబట్టి ఇవి మొదటి రకం కిలో రూ.27.40, రెండో రకం రూ.20.70, మూడో రకం రూ.14 చొప్పున ధరలు పలికాయి. పలమనేరు మార్కెట్ లో వరుగా రూ.21, రూ.16, రూ.12 పలికాయి. ఇవి సామాన్యుల దగ్గరకు చేరుకునేసరికి రూ.30 నుంచి రూ.35 అవుతున్నాయి. ఈ ఏడాది జూన్, జులైలో కూడా టమాటా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.200 పలికింది. వీటి తర్వాత వంతు ఉల్లిపాయలకు వచ్చింది. నిన్నటి వరకు ధరలు లేక రోడ్డుపై పోరబోయగా, ఈరోజు నెమ్మదిగా ఆకాశానికి చేరుతున్నాయి.












Click it and Unblock the Notifications