టమాటా రైతన్నల కంట కన్నీరు.. అప్పుడు 200.. ఇప్పుడు 2 రూపాయలే!!
మొన్నటి దాకా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు ఇప్పుడు పతనానికి చేరుకున్నాయి. గత రెండు నెలల క్రితం వరకు 200 రూపాయల దాకా పెరిగి మంట పుట్టించిన టమాటా ధరలు ఇప్పుడు చవకగా మారాయి. అప్పుడు కొందామంటే ఇబ్బంది పడిన వారు ఇప్పుడు తగ్గిన ధరలను చూసి అవాక్కవుతున్నారు. కానీ టమాటా రైతులు భారీగా పతనమైన ధరలతో లబోదిబోమంటున్నారు.
కర్నూలు పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో టమాటా ధర కనీసం రెండు రూపాయలు కూడా పలకని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో దాదాపు అన్ని మార్కెట్ లలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ధరలు తగ్గటం కొనుగోలుదారులకు సంతోషం కలిగించినా టమాటా సాగు చేసిన రైతులకు మాత్రం తీరని ఆవేదన మిగులుతుంది.

ఆరుగాలం శ్రమించి టమాటా పంట సాగు చేసిన రైతులు కనీసం కూలీలు, రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కాక కన్నీరు మున్నీరు అవుతున్నారు. రెండు నెలల క్రితం టమాటా సాగు చేసిన రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు కాగా, ఇప్పుడు మళ్ళీ రైతన్నలకు ధర లేక పెద్ద కష్టమే వచ్చింది.
టమాటాల ధరల నియంత్రణ అవసరమే కానీ రైతులకు కనీసం గిట్టుబాటు కూడా కాని విధంగా టమాటాల ధరలు పడిపోవటం మాత్రం దారుణం. కిలో టమాటా 20, 30 రూపాయలు ఉన్నా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తారు. టమాటా రైతులకు గిట్టుబాటైనా ఉండేలా ధరలు ఉండాల్సిన అవసరం ఉంది.
పెంచితే అసలు టమాటా వంక చూడకుండా ధరలు చుక్కలు తాకటం, తగ్గితే అధో పాతాళానికి పడిపోవటం రెండూ మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అప్పుడు దిగుబడి లేక పెరిగిన ధరలు, ఇప్పుడు దిగుబడి బాగా ఉండటంతో పడిపోయాయి. ప్రతీ ఒక్కరు నిత్యావసర వస్తువులా కూరలో వాడే టమాటాల విషయంలో రైతులకు, వినియోగదారులకు లాభం జరిగేలా ఉండాలి. టమాటా రైతన్నల విషయంలో టమాటా ధరల విషయంలో ప్రభుత్వాలు చొరవ చూపించాలి.












Click it and Unblock the Notifications