ఆ చారిత్రక ఒప్పందం జరిగితే విశాఖలో ఉద్యోగాల పంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్న నాటి నుంచి ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లాలని, ఏపీకి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు గూగుల్ తో ఒప్పందం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 14వ తేదీ చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం అని, తన రాజకీయ జీవితంలో ఇది ఒక అపూర్వఘట్టం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్
గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని చెప్పిన ఆయన గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైందని, ఇప్పుడు బ్రాండ్ ని తిరిగి పునర్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని, దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా విశాఖ మారిపోతుందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక దశ, దిశ మారుతుందన్న చంద్రబాబు
ఓవైపు డేటాసెంటర్ మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందిస్తున్నామని పేర్కొన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు తనకు కలిగిన ఆనందం, అనుభూతి ఇంకెప్పుడూ కలగలేదని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక దశ, దిశ మారుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2029 చివరినాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు.
యువతకు ఏఐ మరియు హై ఎండ్లో ఉద్యోగాలు
విశాఖపట్నంలో 1-GW డేటా సెంటర్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు. దీంతో యువతకు ఏఐ మరియు హై ఎండ్లో ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడంతో బ్రాండ్ వచ్చిందని, విశాఖకు google రాకతో అదే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్
డేటా సెంటర్ కు సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్ ను సముద్ర మార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైనా ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తాయని ఊహించామా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు కొందరు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అడ్డుపడుతున్నారని, ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు పెట్టుబడులు రాకుండా చేయడాన్ని, బెదిరించడాన్ని ఫ్యాషన్ గా మార్చుకున్నారని అసహనం వ్యక్తం చేశారు.
నవంబర్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని
నవంబర్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని మోడీని ఆహ్వానిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండస్ట్రీస్, రామాయపట్నంలో బిపిసిఎల్ శుద్ధి కర్మాగారం వంటి పెద్ద కంపెనీల ఏర్పాటుతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రంగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications