విషాదం : గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కాలం మొదలయ్యింది. ఇంటర్‌మీడియట్ పరీక్షలు పూర్తికాగా, మార్చి 18నుంచే రెండు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదోతరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్రమైన ఆందోళనకు గురికావడమే కాకుండా, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు క్లాసురూమ్‌ల్లోనే కుప్పకూలిన సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఇలాంటి సంఘటనే ఇప్పడు ఒకటి కడప జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్షల ఒత్తిడి పిల్లలపై ఎంతలా ప్రభావం చూపుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని రాజాపాలెం మండలం కొర్రపాడు గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న లిఖిత అనే విద్యార్థిని తరగతి గదిలోనే ఒక్కసారికి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. నిన్న పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ ఆ బాలిక అక్కడిక్కడే హఠాత్తుగా పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఆ విద్యార్థిని హుటాహుటినా స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఒత్తిడి కారణమయ్యి ఉండొచ్చు : ఆసుపత్రిలో ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆమె మరణానికి గుండెపోటే కారణమని డాక్టర్లు తెలిపారు. పరీక్షల సమయం కావడంతో తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురై ఉండవచ్చని భావిస్తున్నారు. అంతవరకు తమతోపాటే ఉన్న తోటి స్నేహితురాలు ఒక్కసారిగా ఇకలేదని తెలియడంతో అక్కడి విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. మరోవైపు లిఖిత మృతితో కొర్రపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ ఆ బాలిక తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications