తిరుపతికి ప్రతీరోజూ రైలు..రైల్వే ముందు భారీ డిమాండ్ పెట్టింది ఎవరంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమలకు శ్రీవారి దర్శనానికి ప్రతీ ఒక్కరూ వెళ్ళాలనే ఆశ పడతారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ప్రయాణంలో పడరాని పాట్లు పడతారు. అయినాసరే దేవదేవుడు అయిన శ్రీవారిని దర్శించుకోవటం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్ళు నడుస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ తిరుమలకు డిమాండ్ కు తగ్గట్టు రైళ్ళు అందుబాటులో లేవు.
తిరుపతికి రైలు.. వీరి చిరకాల వాంఛ
అలాంటి జిల్లాల ప్రజలు తిరుపతికి తమకు ప్రత్యేక రైలు కావాలని రైల్వే ముందు తమ చిరకాల వాంఛను పెడుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ప్రజలు కూడా తిరుమలకు వెళ్లేందుకు తమకు ప్రతీరోజూ రైలు సౌకర్యం కావాలని అభ్యర్థిస్తున్నారు. కృష్ణా జిల్లా ప్రజలు ఎప్పటినుండో మచిలీపట్నం నుండి తిరుపతికి ప్రతిరోజు రైలు ఏర్పాటు చేయాలనీ కోరుతున్నారు.

తిరుపతికి వెళ్లేందుకు మచిలీపట్నం వాసుల ఇబ్బంది
దీనిగురించి ఇటీవల మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ తో మాట్లాడారు. గతంలో నర్సాపురం నుండి కొన్ని బోగీలు, మచిలీపట్నం నుండి కొన్ని బోగీలు గుడివాడలో కలిపి తిరుపతికి వెళ్ళేవారని, అందువలన తిరుపతి వెళ్ళే ప్రయాణికులకు ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు అసౌకర్యంగా ఉంటుంది అని ఆయన రైల్వే బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్ళారు.
రైల్వే బోర్డు చైర్మన్ కు ఎంపీ విజ్ఞప్తి
బోగీలు మారటం కారణంగా లగేజిని తీసుకు వెళ్ళడం, ప్లాట్ ఫారం లు మారడం ఇబ్బందికరంగా ఉందని వచ్చిన ప్రజల డిమాండ్ నేపధ్యంలో మచిలీపట్నం నుండి తిరుపతికి ప్రతిరోజూ తిరిగేలా ఒక రైలు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు చైర్మన్ ను కోరారు .
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల రైలు కోరిక తీరుతుందా?
కృష్ణా జిల్లా కేంద్రం అయిన మచిలీపట్నం నుండి ప్రతిరోజూ పెద్ద ఎత్తున తిరుపతికి వెళ్లి, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనే భక్తులకు ఈ రైలు సౌకర్యంగా ఉంటుందని ఆయన రైల్వే బోర్డు చైర్మన్ కు తెలిపారు. పరిశీలించి సానుకూలంగా త్వరలోనే తగినచర్యలు చేపట్టడం జరుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ చైర్మన్ మరియు ఎంపి బాలశౌరికి తెలియచేశారు.
రైల్వే మచిలీపట్నం- తిరుపతి రైలు ఇస్తుందా?
ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని, కృష్ణాజిల్లా బస్సులు బలంగా కోరుతున్నారు. మరి దీనిపైన ఆలోచిస్తామని చెప్పిన రైల్వే బోర్డు మచిలీపట్నం వాసులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications