ఇక నేరుగా ఇంటికే అయ్యప్ప దివ్య ప్రసాదం, ఇలా బుక్ చేసేవారికే..!!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం దేవస్థానం పరిధిలోని దేవాలయాల్లోని అన్ని ప్రసాదాలను భక్తులు ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. శబరిమల ఆలయానికి నేరుగా వెళ్లలేని భక్తులకు ప్రసాదం డోర్ డెలివరీ చేసేలా కొత్త విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ఇక నుంచి ఆన్ లైన్ లో ప్రసాదాలను బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది
భక్తులకు మరింత సదుపాయాలను పెంచే క్రమంలో భాగంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని తాము కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్‌ను ప్రారంభించామని, మొత్తం దేవస్థానం కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తున్నామని బోర్డు పేర్కొంది. ట్రావెన్ కోర్ దేవస్వం పరిధిలోని దేవాలయాల్లో భక్తులు ఇకపై అన్ని ప్రసాదాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపు పని చేయడం ప్రారంభిస్తుందని వెల్లడించారు. ముందుగా ఈ సౌకర్యం ప్రధాన దేవాలయాల్లో అందుబాటులోకి తెస్తామని... ఆరు నెలల తరువాత ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు పరిధిలోని మొత్తం 1252 దేవాలయాలకు ఈ సేవలను విస్తరిస్తామని చెప్పారు.

ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ప్లాటినం జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, దేవస్థానం కార్యకలాపాలు అన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) ట్రావెన్కోర్ దేవస్వం కోసం క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఇది ఆన్లైన్ బిల్లింగ్తోపాటు దేవాలయాల్లోని తిరువాభరణం లాంటి విలువైన వస్తువుల సమాచారాన్ని, ఆలయ భూములకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది.
ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకమైన వైబ్‌సైట్ రూపొందిస్తున్నారు. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డులో ఉన్న అన్ని ఆలయాల సమాచారాన్ని, కార్యకలాపాలను ఒక ఏకీకృత వ్యవస్థలోకి తెస్తూ నిర్ణయించారు. ఆలయ కార్యకలాపాలు, భక్తులకు అందించే సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి వీలవుతుంది. ఈ సాఫ్ట్ వేర్ ను కేరళ దేవాలయల పూజా పద్ధతులు, ఆచారాలకు అనుగుణంగా మార్పులు చేశారు.












Click it and Unblock the Notifications