పెదఅవుటపల్లి హత్యలు: కీలక నిందితుల పట్టివేత
విజయవాడ: రాష్ట్రంలో సంచలనం రేపిన కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి హత్యల కేసులో ముగ్గురు కీలక నిందితులను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు వెల్లడించారు. పినకమిడికి చెందిన భూతం బాలాజీ, మహేష్, శివలు గంధం కుటుంబాన్ని హతమార్చటంలో ప్రత్యేక పాత్ర వహించారన్నారు.
గత నెల 24వ తేదీన ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి గంధం మారయ్య, పగిడి మారయ్యలు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు ఏలూరు నుంచి వారి తండ్రి గంధం నాగేశ్వరరావు వచ్చారు. అంతకుముందే విమానాశ్రయం వద్ద బాలాజీ, మహేష్, శివలు ఎరుపురంగు కారులో క్యాప్‌లు ధరించి ఉన్నారు. వీరితో పాటు పల్సర్ బైక్‌పై హంతకముఠా సభ్యుడు(షూటర్స్‌బ్యాచ్)కూడా అక్కడే ఉన్నాడు.
మారయ్యలు విమానం దిగి బయటకు వచ్చి తవేరా కారు ఎక్కగానే ఆ ముగ్గురూ చంపాల్సిన వ్యక్తులని షూటర్‌కు చూపించారు. దీంతో అతను షూటర్స్‌కు సమాచారం అం దించాడు. తవేరా కారును ఆ షూటర్స్ మరో కారులో వెంబడించి గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హతమార్చారు. శివ, మహేష్, బాలాజీలు ఘటన అనంతరం గుంటూరు వెళ్లి కారును వదిలి బస్సులో చెన్నై వెళ్లారు.

అక్కడ నుంచి రైలులో ఢిల్లీ, తర్వాత హైదరాబాద్ ఇలా రకరకాల ప్రదేశాలలో తలదాచుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న పశ్చిమగోదావరి జిల్లా పినకమిడికి చెందిన 12 మందిని గుర్తించి ఫోటోలను విడుదల చేశారు. వాటిని చూసి పలువురు సమాచారమివ్వగా ఈ ముగ్గురిని అరెస్ట్‌చేశారు. భూతం గోవింద్ లండన్‌లో ఉన్నట్లు సమాచారంతో రెడ్‌కార్నర్ నోటీస్ జారీచేయనున్నట్లు తెలిపారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఏడుగురు నిందితుల్ని ఈ నెల 20 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గన్నవరం కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది.
పోలీసు దర్యాప్తు బృందాలు దేశ రాజధాని ఢిల్లీలో హత్యలకు పాల్పడిన ఏడుగురు నిందితులను ఇదివరకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హత్యలకు కుట్ర పన్నిన వారితో సహా కిరాయి హంతకులను అరెస్టు చేసినట్లు అక్కడి జాయింట్ కమిషనర్ యాదవ్ వెల్లడించారు. విజయవాడ పోలీసు కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు, డిసిపి తస్వీర్ ఇక్బాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ఢిల్లీ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకోగలిగారు.












Click it and Unblock the Notifications