చంద్రబాబు, పవన్ కు మరో సంకటం ? కీలకంగా మోడీ నిర్ణయం-తేడా వస్తే..!
ఎన్డీయేకు కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరోసారి చిక్కుల్లో పడబోతున్నారు. ఓ కీలకమైన చట్టం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రం తన అభిప్రాయం చెప్పక తప్పని పరిస్ధితుల్లో భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జనసేనను ప్రధాని మోడీ పరిగణనలోకి తీసుకుంటారా లేక ఏకపక్షంగా ముందుకు సాగిపోతారా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ పరిగణనలోకి తీసుకుంటే వీరిద్దరికీ మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చు.
1991లో అయోధ్య-రామజన్మభూమి ఉద్యమం నేపథ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కేంద్రంలో ఉన్న పీవీ నరసింహారావు సర్కార్ ప్రార్ధనా స్థలాల పరిరక్షణ చట్టం తీసుకొచ్చింది. 1947 ఆగస్టు 15 నాటికి అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఉన్న ఏ మతానికి చెందిన ప్రార్ధనా స్థలాలను కూడా ఇతర మతాలకు ఇవ్వకుండా యథాతథంగా ఉంచాలని ఈ చట్టం చెబుతోంది. అయితే దీన్ని ఉల్లంఘించి అప్పట్లో బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చేశారు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఈ వివాదం తలెత్తినప్పుడు ఈ ఒక్క ఘటనకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

అయితే ఆ తర్వాత ఇదే మినహాయింపును వాడుకుని ఇప్పుడు దేశంలో దాదాపు 10 చోట్ల మసీదులు, దర్గాలను తమ ఆలయాలపై కట్టారని ఆరోపిస్తూ హిందూ సంస్థలు స్థానిక కోర్టుల్ని ఆశ్రయించాయి. ఆయా పిటిషన్లపై స్పందించిన ట్రయల్ కోర్టులు.. ఆయా మసీదులు, దర్గాల్లో సర్వేలకు ఆదేశాలు ఇస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టులో ప్రార్ధనా స్థలాల చట్టం అమలు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. ఇది పూర్ణయ్యే వరకూ ఏ కోర్టు కూడా మందిరం-మసీదు వివాదాలపై ఆదేశాలు ఇవ్వొద్దని, కొత్త పిటిషన్లు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే కేంద్రాన్ని కూడా నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అయితే ఇన్నాళ్లూ హిందూత్వ అజెండాతో మధుర, సంభాల్, అజ్మీర్ దర్గాపై స్ధానిక నేతలతో పిటిషన్లు వేయిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఆలయాలకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేస్తే తమ హిందూత్వ అజెండా బయటపడటం ఖాయం. అలాగని తటస్థంగా ఉంటే హిందూ సంస్థలు, ఆరెస్సెస్ నుంచి వ్యతిరేకత తప్పదు. ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్రం ఇరుకునపడుతోంది. అలాగే కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఇక్కడ ఇరుకునపడ్డాయి. ముఖ్యంగా ఏపీలో టీడీపీపై దీని ప్రభావం కచ్చితంగా ఉండబోతోంది..












Click it and Unblock the Notifications