కొంపముంచిన టీడీపీ ఎమ్మెల్యేలు-సీమ లిఫ్ట్ పై లేఖతో జగన్, చంద్రబాబుకూ ఇరకాటం
రాయలసీమ లిఫ్ట్ వల్ల ప్రకాశం జిల్లాకు నష్టం కలుగుతోందంటూ స్ధానిక టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు రాసిన లేఖ రెండు, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యేల లేఖతో ఇటు సీఎం జగన్ తో పాటు చంద్రబాబు కూడా ఇరుకునపడ్డారు. అదే సమయంలో రాయలసీమ లిఫ్ట్ కు వ్యతిరేకంగా ఏపీతో పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సంతోషంలో మునిగిపోయాయి. రాయలసీమ లిఫ్ట్ కు స్వరాష్ఠ్రంలోనే వ్యతిరేకత ఉందనే అంశాన్ని కేంద్రం, కృష్ణాబోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణకు మంచి అవకాశం కూడా లభించింది.

రాయలసీమ లిఫ్ట్ పై భారీ ట్విస్ట్
రాయలసీమ సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తుందని భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ-తెలంగాణ మధ్య వాటర్ వార్ సాగుతోంది. రాయలసీమ లిఫ్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్.. దీనిపై ఎందాకైనా వెళ్తామని రోజూ హెచ్చరికలు చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ పై జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీశైలం, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి కౌంటర్ కూడా ఇచ్చింది. ఇలాంటి పరిస్ధితుల్లో సీమ లిఫ్ట్ వల్ల తమ జిల్లా ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయులు, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి సీఎం జగన్ కు లేఖ రాయడం భారీ ట్విస్ట్ గా మారింది.

జగన్, చంద్రబాబుకూ ఇరకాటం
రాయలసీమ లిఫ్ట్ నిర్మిస్తే ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతుందంటూ ఆ జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖతో ఇప్పుడు సీఎం జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇరుకునపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే జిల్లా ప్రయోజనాలే ముఖ్యంగా ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖతో జగన్, చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ వద్ద గట్టిగా ప్రశ్నించే పరిస్ధితి లేకుండా పోతోంది. రేపు సీమ లిఫ్ట్ పై గట్టిగా మాట్లాడితే స్వరాష్ట్రంలో వ్యతిరేకతను తెలంగాణ తెరపైకి తెచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇరువురు నేతలు ఈ లేఖపై ఎలా స్పందించాలన్న దానిపై మథనపడుతున్నారు.

చంద్రబాబుకు పుండు మీద కారం
రాయలసీమ లిఫ్ట్ వల్ల ప్రకాశం జిల్లా ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారబోతోంది. ముఖ్యంగా ఏపీ-తెలంగాణ వాటర్ వార్ పై గట్టిగా మాట్లాడితే ఎక్కడ విమర్శలు ఎదురవుతాయోనని మౌనాన్నే ఆశ్రయిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు ప్రకాశం ఎమ్మెల్యేల లేఖ పుండు మీద కారం జల్లినట్లుగా మారిపోయింది. అసలే ఏపీ-తెలంగాణ వాటర్ వార్ లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకుుంటున్న చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేల లేఖ కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది.
Recommended Video

ప్రకాశం ఎమ్మెల్యేలపై చంద్రబాబు గుర్రు ?
రాయలసీమ లిఫ్ట్ ను సమర్ధించాలో, వ్యతిరేకించాలో తెలియక ఓవైపు మథన పడుతున్న పరిస్ధితుల్లో ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు రాసిన లేఖతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. సీమ లిఫ్ట్ పై పార్టీ వైఖరి తెలుసుకోకుండా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ రాయటం కూడా సొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తనకు లేఖ రాయకుండా సీఎం జగన్ కు లేఖ రాయడాన్ని కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల వివరణ కోరే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications