ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీలో చేరకముందే చిక్కులు? వెనక్కి తగ్గని ప్రత్యర్ధులు..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో పరిస్ధితులు బాగోలేవని, ఆ పార్టీకి గుడ్ బైకి చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఓ ఎమ్మెల్యే. అయితే రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న సదరు ఎమ్మెల్యే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీలో అదే సీటు నుంచి టికెట్ ఆశిస్తున్న ప్రత్యర్ధులు ముందే ఆయనకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సదరు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరతారా లేదా అన్న చర్చ మొదలైంది.
వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్న ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు తాజాగా చంద్రబాబు కీలక హామీ ఇచ్చేశారు. టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో మమేకం అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ టికెట్ పై ఇంకా ఆశలు వదులుకోని స్ధానిక నేత బొమ్మసాని సుబ్బారావు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు.

నిన్న వసంత కృష్ణప్రసాద్ తరఫున ఆయన తండ్రి, రాజకీయ దిగ్గజ నేత వసంత నాగేశ్వరరావు.. మైలవరంలోని బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. తన కుమారుడికి సహకరించాలని కోరారు. అయితే అందుకు సుబ్బారావు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. వసంత కృష్ణ ప్రసాద్ కు సహకరించేది లేదని బొమ్మసాని సుబ్బారావు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో వసంత నిరాశగా వెనుదిరిగారు.
అయితే ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ నాయకులను కలుస్తున్న కృష్ణ ప్రసాద్.. బొమ్మసాని సుబ్బారావు వ్యవహారం మార్చి 2 న అధికారికంగా టీడీపీలో చేరాక చూద్దామనే భావనలో ఉన్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్ధి, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. దీంతో బొమ్మసాని సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ వసంత కు కాదు...తనకే టిక్కెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు డిమాండ్ చేస్తుండటం సమస్యగా మారింది.












Click it and Unblock the Notifications