టిలో తెరాస, సీమాంధ్రలో టిడిపి, ఢిల్లీ మోడీదే: లగడపాటి
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ విజయ ఢంకా మోగిస్తాయని, రెండు రాష్ట్రాల్లోను టిడిపి, తెరాస సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని లగడపాటి రాజగోపాల్ శనివారం జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందన్నారు. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్, ఒపినీయన్ పోల్స్ ప్రకటనపై నిషేధం ఉండటంతో... గెలుపు గుర్రాల గురించి తన అభిప్రాయం మాత్రమే చెప్పారు.
తన సర్వేల పేరిట ఎస్సెమ్మెస్‌లు ప్రచారంలో ఉన్నాయని, తానెలాంటి సర్వే నివేదికలు విడుదల చేయలేదని చెప్పేందుకు శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కారు దూసుకుపోయిందని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, 7న సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జరిగే పోలింగ్‌లో సైకిల్ స్పీడ్‌గా ఉందని, తన అభిప్రాయం మేరకు... 70 శాతం వరకు పోలింగ్ జరిగితే సుమారు 90 స్థానాలతో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు.

బిజెపికి మంచి ఫలితాలే వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండి ఉంటే టిడిపి, బిజెపి కూటమికే అత్యధిక సీట్లు వచ్చేవని, ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని ఉండేది కాదన్నారు. విభజన జరిగాక సీమాంధ్ర ఓటర్లు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కేంద్ర సహకారంతోనే అది సాధ్యమని నమ్ముతున్నారన్నారు. అందుకే టిడిపి, బిజెపి పొత్తును వారు స్వాగతిస్తున్నార్నారు.
విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలతోపాటు టిడిపి ఎంపీలు కూడా పార్లమెంటులో గట్టిగా పోరాడినట్లు నమ్ముతున్నారన్నారు. వారు టిడిపి వైపు మొగ్గడానికి ఇదీ ఓ కారణమన్నారు. తనకు తెలిసినంత వరకూ ఎన్డీయేకి 270కి పైగా లోకసభ స్థానాలు వస్తాయన్నారు. సీమాంధ్రలో టిడిపి, బిజెపిలకు 20 వరకూ లోకసభ స్థానాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు నెలముందు స్థానిక ఎన్నికలు జరగడంతో గ్రామీణ ఓటర్లలో పార్టీలవారీగా స్పష్టమైన విభజన వచ్చేసిందన్నారు. సీమాంధ్రలో టీడీపీ, జగన్ పార్టీల వైపు ఎవరెవరున్నారో స్పష్టమైందన్నారు.












Click it and Unblock the Notifications