సీమాంధ్ర ఎమ్మెల్యేల్ని ఎత్తుకెళ్లిన టిఆర్ఎస్, వాయిదా

బుధవారం ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, రామానాయుడులు జై సమైక్యాంధ్ర, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాక తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్దకు బైఠాయించారు. దీంతో తెరాస ఎమ్మెల్యేలు వారిని ఎత్తుకొని పక్కకు తీసుకొచ్చారు. అంతకుముందు సభ సీమాంధ్ర టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చెరోసారి బెల్లు కొట్టారు.
స్పీకర్‌కు లేఖ
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభాపతి నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో అనేక అనుమానాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. జల పంపిణి, విద్య, ఉద్యోగాల అంశాలపై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం కావాలన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, ఆదాయం, విద్యుత్ అంశాలపై సమాచారం కావాలని కోరారు.
ఉభయ సభలు వాయిదా
సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో శాసన మండలి బుధవారం ఉదయం నుండి మారుమోగింది. సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ సీమాంధ్ర ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో మండలిని గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు శాసన సభ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుండి ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించారు. బిల్లుపై చర్చించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, సమైక్యాంధ్రపై తీర్మానం చేయాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications