కెసిఆర్ టార్గెట్ టిటిడిపి: 2 నెలల్లో 42కు తెరాస బలం?

కెసిఆర్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల పైన దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. తెరాసలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఎక్కువ మంది మాజీ టిడిపి నేతలే. రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా జుక్కల్ శాసన సభ్యులు హన్మంతు షిండే తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈయన చేరికతో తెరాస బలం 22కు చేరింది.
తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు తమ వైపుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వారు కూడా టిడిపికి చెందిన వారే ఉంటారని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిపై పలువురు తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని హన్మంతు షిండే రెండు రోజుల క్రితం చెప్పారు. మరికొందరు తెరాసలోకి వస్తారని చెప్పారు.
తెలంగాణ ఇచ్చినందున తెరాస తమ పార్టీలో విలీనం కావాలని కాంగ్రెసు భావిస్తోంది. పొత్తు పైన సమాలోచనలు జరుపుతోంది. కెసిఆర్ మాత్రం తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యే వరకు పొత్తు పైన మాట్లాడదల్చుకోలేదు. అయితే తెలంగాణ వచ్చినా పార్టీ ఉంటుందని చెప్పినందున బలోపేతంపై దృష్టి సారించారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతారని తెరాస, కెసిఆర్ భావిస్తున్నారు. పదమూడేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరాస ఉద్యమిస్తోంది. దీంతో తెరాస వల్లనే తెలంగాణ సాధ్యమైందని ప్రజలు భావిస్తున్నారని, అందుకే పునర్నిర్మాణంలో తమ పాత్ర ఉండాలని వారు కోరుకుంటున్నారని ఆ పార్టీ చెబుతోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కెసిఆర్ వల్లనే సాధ్యమైందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, కాంగ్రెసును నమ్మడం లేదని ఆ పార్టీ సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు అన్నారు. తెలంగాణను కాంగ్రెసు పార్టీ ఇచ్చినప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని, తెరాసలోకే వస్తారని హరీష్ అన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పట్టు సాధించే దిశలో టిడిపి ప్రజాప్రతినిధులతో పాటు, ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలపై తెరాస దృష్టి సారించిందంటున్నారు. తెలంగాణలో టిడిపికి మంచి క్యాడర్ ఉంది. ఈ కారణంగానే తెరాస ప్రధానంగా ఆ పార్టీ పైన కన్నేసిందంటున్నారు. కాంగ్రెసు పార్టీలో పలువురు ఆయా నియోజకవర్గాల నుండి టిక్కెట్లు ఆశిస్తున్నారు. అలాంటి వారిని కూడా తమ వైపుకు రప్పించి టిక్కెట్ ఇచ్చి కాంగ్రెసు పార్టీని దెబ్బకొట్టాలని తెరాస భావిస్తోందట.
2014 ఎన్నికల్లో తెరాస 75 స్థానాల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది. ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అప్పటికి పలువురి చేరికతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య నలభైకి పైగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications