అవినాశ్ బెయిల్ పై ఉత్కంఠ.. నేడు ప్రత్యేకంగా, ఏం జరుగుతోంది..!!
ఎంపీ అవినాశ్ బెయిల్ పై నేడు క్లారిటీ రానుంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్ వ్యవహారంలో ఇప్పటి వరకు అనేక మలుపులు తీసుకుంది. సీబీఐ అవినాశ్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తోందని..బెయిల్ పిటీషన్ పై విచారణ పూర్తి చేయాలని ఎంపీ తరపు న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం విచారణ చేయాల్సి ఉన్నా.. సమయం ముగియటంతో ఈ రోజు విచారణ కోసం హైకోర్టు ప్రత్యేకంగా సమావేశమవుతోంది.
హైకోర్టులో విచారణ: వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు (శుక్రవారం) విచారణ జరగనుంది. అవినాశ్ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం.లక్ష్మణ్ వెకేషన్ బెంచ్ ఎదుట 77వ కేసుగా లిస్ట్ అయింది. సాయంత్రం 6.30 గంటలకు విచారణకు వచ్చింది. ఎవరెవరు ఎన్ని గంటలు వాదనలు వినిపిస్తారో చెప్పాలని న్యాయమూర్తి కోరారు. తమకు గంట సరిపోతుందని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. అయితే తమకు రెండ్రోజులు కావాలని.. కనీసం ఒక రోజంతా అవసరమని అవినాశ్ తరఫు సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు తెలిపారు. నిజానికి శుక్రవారం వెకేషన్ బెంచ్‌కు పనిదినం కాకపోయినప్పటికీ... ఈ కేసు కోసమే సమావేశం కానుంది.

కొనసాగుతున్న ఉత్కంఠ: సమయం పైన అవినాశ్ తరపు న్యాయవాదులు తమకు సమయం కేటాయించాని కోరారు. అవినాశ్‌రెడ్డి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి కూడా రెండ్రోజులు వాదనలు వినిపించారని .. ఈ ధర్మాసనం కొత్తగా కేసును విచారిస్తున్నందున దాదాపు అంతే సమయం పడుతుందని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇంకా వినాల్సిన లంచ్ మోషన్ పిటిషన్లు ఉండడంతో ఈ పిటిషన్‌పై వాదనలు వినడం సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేశారు. ఈ కేసుపై వేసవి సెలవులకు ముందు వాదనలు విన్న జస్టిస్ కె.సురేందర్ ధర్మాసనం.. విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. దీనిపై అవినాశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ కేసు వినాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోలుకుంటున్న అవినాశ్ తల్లి: అటు అవినాశ్ తల్లి ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతోంది. వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ రోజు హైకోర్టులో జరిగే విచారణ..నిర్ణయం పైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. తన తల్లికి కర్నూలులోని ఆస్పత్రికిలో చికిత్స అందిస్తూ అవినాశ్ అక్కడే ఉంటున్నారు. సీబీఐ అధికారులు అక్కడే మకాం వేయటంతో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ కొనసాగింది. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న అవినాశ్ మద్దతు దారులతో హై టెన్షన్ కొనసాగింది. ఈ సమయంలో అవినాశ్ అటు సీబీఐకి లేఖలతో పాటుగా న్యాయస్థానంలో తన బెయిల్ పిటీషన్ పైన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్ధించారు. ఈ రోజు హైకోర్టులో అవినాశ్ బెయిల్ పిటీషన్ పైన అన్ని పక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యాయి. నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications